Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ 2.80 లక్షల కోట్లకు పైనే
- ఫిబ్రవరి 3న గవర్నర్ ప్రసంగం...అదే రోజు బీఏసీ
- 6న బడ్జెట్ ప్రతిపాదన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఈఏడాది ఎన్నికల సీజన్. అందుకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ బడ్జెట్ను ప్రవేశ పెట్టనుంది. దాదాపు రూ 2.80లక్షల కోట్లతో ఈనెల 6న బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి ప్రతిపాదించనున్నారు. ఇప్పటికే పూర్తి బడ్జెట్ రూపకల్పన ప్రక్రియను పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం...గవర్నర్కు వద్దకు ఆమోదం కోసం పంపింది. గవర్నర్ ఆమోద ముద్ర వేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇరుపక్షాలకు చెందిన న్యాయవాదుల అంగీకారంమేరకు ఈనెల 3న ఉభయ సభలనుద్దే శించి గవర్నర్ ప్రసంగించనున్నారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశం కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేయనుంది. మరుసటి రోజు గవర్నర్కు ధన్యవాదాల తీర్మానాన్ని ఉభయ సభలు ఆమోదించనున్నాయి. అనంతరం బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చ జరగనుంది.
గవర్నర్ వ్యూహమేంటి?
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో గవర్నర్ వ్యూహంపై చర్చ మొదలైంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్కు మధ్య విబేధాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత అసెంబ్లీ బడ్జెట్ సమా వేశాల్లోనూ గవర్నర్ ప్రసంగం లేకుండా సభలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ 2023-24పై ఆమోద ముద్రవేయకుండా గవర్నర్ వ్యూహాత్మంగా వ్యవహరించారు. చివరికి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ప్రసంగానికి అంగీకరించింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్కు ఉన్న వైరం సమసిపోయేలా లేదనే చర్చ జరుగుతున్నది. ఈ సందర్భంగా బీజేపీయేతర పక్షాలు అధికారంలో ఉన్న కేరళ, తమిళనాడు, బీహార్, ఢిల్లీ ప్రభుత్వాలను బీజేపీకి చెందిన గవర్నర్లు ఇబ్బందులకు గురి చేస్తున్న విషయాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. ఇటీవల తమిళనాడు గవర్నర్ బడ్జెట్ ప్రసంగంలో కొన్ని పేజీలు, కొన్ని పదాలను చదవకుండా ఉద్దేశపూర్వకంగా వదిలేశారనే విమర్శ లొచ్చాయి. అక్కడి గవర్నర్ తీరును పార్టీలకు అతీతంగా సభ్యులందరూ ఎదుర్కొని అసెంబ్లీ సమావేశాల నుంచి బయటకు పంపించారు. ఈ క్రమంలో తెలంగాణ గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు కూడా పలు అనుమానాలకు తావిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు అసెంబ్లీ వేదికగా గవర్నర్ ఏం చేయనున్నారనేది చర్చ కొనసాగుతున్నది.