Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10.50 కోట్ల పనిదినాలు పూర్తి చేశాం :కేంద్రానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో రానున్న ఆర్థిక సంవత్సరానికిగానూ ఉపాధి హామీ చట్టం కింద 12 కోట్ల పనిదినాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ రోడ్ల నిర్వహణ, రోడ్ల మరమ్మత్తులు, కొత్త రోడ్ల పనుల పురోగతిపై, ఉపాధి హామీ చట్టం కింద కల్పించే పనిదినాలు, మెటీరియల్ కాంపోనెంట్ పనులు, నిధులపై సోమవారం హైదరాబాద్లోని మంత్రుల నివాస ప్రాంగణంలోని మంత్రి చాంబర్లో సమీక్ష చేపట్టారు. అందులో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, కమిషనర్ హన్మంతరావు, ఉపాధి, హామీ చట్టం స్పెషల్ కమిషనర్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...పంచాయతీరాజ్ కింద మంజూరు చేసిన సీసీ రోడ్ల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ రోడ్ల మరమ్మత్తుల పనులకు టెండర్లు పిలవని జిల్లాల్లో వెంటనే పిలిచే ఏర్పాట్లు చేయాలన్నారు. మొదటిసారి టెండర్ కాల్ ఫర్ చేసిన చోట్ల స్పందన లేకపోతే వెంటనే రెండోసారి పిలవాలన్నారు. ఉపాధి హామీ చట్టం కింద ఈ ఏడాది 10.5 కోట్ల పనిదినాలు పూర్తి చేశామనీ, వీటిని 12 కోట్ల పనిదినాలకు పెంచాలని కేంద్రానికి పంపిన ప్రతిపాదనలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. మెటీరియల్ కాంపోనెంట్ కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు దాదాపు 800 కోట్ల రూపాయలు కేంద్రం ఇంకా విడుదల చేయలేదనీ, ముఖ్య కార్యదర్శి, అధికారులు ఢిల్లీకి వెళ్లి ఈ నిధుల విడుదల కోసం కషి చేయాలన్నారు.