Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15 నుంచి పీఎంటీ, పీఈటీ పరీక్షలు
నవతెలంగాణ - ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్రంలో ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులకు సాగుతున్న దేహదారుడ్య పరీక్షలకు మరో 90 వేల మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రాథమిక పరీక్షా ప్రశ్నాపత్రంలో దొర్లిన తప్పులకు గానూ ఏడు మార్కులను కలిపిన కారణంగా ఇటు ఎస్సై, అటు కానిస్టేబుల్ అభ్యర్థులలో దాదాపు 90 వేల మంది ప్రిలిమినరీ పరీక్షలు పాసైనట్టు టీఎస్ఎల్పీఆర్బీ గుర్తించింది. ఇందులో దాదాపు 65 వేల మంది వరకు కానిస్టేబుల్ అభ్యర్థులు కాగా.. 25 వేల మంది ఎస్సై అభ్యర్థులున్నట్టు బోర్డు అంచనా వేసింది. ఈ ప్రాథమిక పరీక్షలో పాసైన ఈ అభ్యర్థులకు ఫిబ్రవరి 15 నుంచి పీఎంటీ, పీఈటీ పరీక్షలను బోర్డు నిర్వహించనున్నది. దాదాపు పది రోజుల పాటు ప్రభుత్వ పని దినాల్లో ఈ పరీక్షలను పూర్తి చేయాలని బోర్డు నిర్ణయించింది. ఇందుకు అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 8వ తేదీ నుంచి టీఎస్ఎల్పీఆర్బీ అధికారిక వెబ్సైట్ నుంచి తమ పాస్వర్డులను ఉపయోగించి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవాలని బోర్డు చైర్మెన్ వి. వి శ్రీనివాసరావు తెలిపారు. ప్రాథమిక పరీక్ష పాసైనవారిలో గర్భిణీ అభ్యర్థులు బోర్డు ఇచ్చిన ఆదేశాల మేరకు తమ మెడికల్ సర్టిఫికెట్లను సోమవారం రోజు దాదాపుగా సమర్పించినట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు గర్భిణీ అభ్యర్థులకు పీఎంటీ, పీఈటీ పరీక్షల నుంచి మినహాయింపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, తుది పరీక్షకు వీరిని అర్హులుగా చేసిన బోర్డు ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఫలితాలు వెల్లడైన నెల లోపలో వీరికి పీఎంటీ, పీఈటీ పరీక్షలను నిర్వహించనున్నది.