Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పోడు భూములకు ఫిబ్రవరి మొదటి వారంలో పట్టాలివ్వాలనీ, అందుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసి సిద్ధంగా ఉంచుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సోమవారం తెలిపారు. ఇప్పటికే వందశాతం సర్వేను గ్రామ సభల ద్వారా పూర్తి చేశామన్నారు. పోడు భూములకు సంబంధించి ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను ఫారెస్ట్ రైట్స్ కమిటీలు, జిల్లా స్థాయి కమిటీల ద్వారా పరిశీలించి లబ్దిదారులను గుర్తించే ప్రక్రియ గతేడాది నుంచి కొనసాగుతుందని తెలిపారు. పోడు భూములకు సంబంధించిన పత్రాలు జారీ చేసే అంశంపై జిల్లా కలెక్టర్లతో సోమవారం హైదరాబాద్‌లోని సంక్షేమ భవన్‌నుంచి రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిలతో కలసి మంత్రి సత్యవతి రాథోడ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అర్హులైన ప్రతీ ఒక్కరికీ పోడు భూములకు పట్టాలివ్వడంతోపాటుగా అడవుల సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని స్పష్టం చేశారు. ఏ జిల్లాల్లోనైతే పోడు భూములకు అధికంగా దరఖాస్తులు అందాయో వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు. ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ, పోడు భూములకు పట్టాలు ఇవ్వడంలో స్థానిక ప్రజా ప్రతినిధులందరినీ భాగస్వామ్యులను చేయాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో అటవీ శాఖ, రెవెన్యూ సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలన్నారు. శాంతి కుమారి మాట్లాడుతూ, అన్ని స్థాయిల్లో ఈ ప్రక్రియను పూర్తిచేసుకొని పట్టా పాస్ పుస్తకాన్ని ప్రింట్ చేసి, ఫిబ్రవరి మొదటి వారానికల్లా సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పీసీసీఎఫ్ డోబ్రియాల్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు తదితర అధికారులు పాల్గొన్నారు.