Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ-కంఠేశ్వర్
పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాల సాధనకు ఫిబ్రవరి 9న జరిగే చలో హైదరాబాద్‌ను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ప్రజా సంఘాల పోరాట ఐక్యవేదిక సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదలందరికీ, అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదని, నేటికీ లక్షల సంఖ్యలో పేదలు ఇల్లు లేక పూరిగుడిసెలో నివాసం ఉంటున్నారని చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అర్హులందరికీ అందేలా ఈ బడ్జెట్లో అత్యధిక నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ద్వారా లబ్దిదారులను ఎంపిక చేసి స్థలం ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని లేదా నిర్మాణానికి రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదల ఇండ్ల సమస్య పరిష్కరించలేని పక్షంలో ప్రజా సంఘాల ఐక్య పోరాట వేదిక ఆధ్వర్యంలో ఇల్లు లేని నిరుపేదలను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. వెంటనే పేదలకు అందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 9న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమానికి పేదలందరూ పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం లో ప్రజా సంఘాల పోరాట ఐక్యవేదిక జిల్లా నాయకులు పెద్దివెంకట్రావు, నూర్జహాన్, శంకర్‌గౌడ్, వెంకటేష్, సబ్బని లత , అనిల్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.