Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- రాష్ట్ర మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ-అడిక్‌మెట్
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేబుల్ ఆపరేటర్ల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా న్యూటారిఫ్ ఆర్డర్ 3ను వ్యతిరేకిస్తూ సోమవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద రాష్ట్ర మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ధర్నాకు హాజరైన మంత్రి మాట్లాడుతూ.. కేబుల్ రంగంలో పంపిణీదారుల దాష్టీకాన్ని నిలువరించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేసిన చరిత్ర కేబుల్ ఆపరేటర్ వ్యవస్థదన్నారు. కేబుల్ ఆపరేటర్ వ్యవస్థ దేశంలో ఒక గొప్ప మార్పు తీసుకొచ్చిందని తెలిపారు. కస్టమర్లపై కేబుల్ టీవీ వినోదపు భారం మునుపటి కంటే తగ్గే విధంగా కొత్త టారిఫ్ ఆర్డర్‌ను ప్రజల ముందుకు తీసుకొచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను మోడీ ప్రభుత్వం ప్రయివేటుపరం చేస్తున్నదన్నారు. ట్రారు అసంబద్ధ విధానాలతో ధరలను పెంచుతున్నారన్నారు. కేబుల్ ఆపరేటర్లకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు అందిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీ ఫైబర్ ప్రాజెక్టులో కేబుల్ ఆపరేటర్లకు భాగ్యస్వామ్యం కల్పించి గ్రామాల్లో చివరి ఇంటి వరకు సేవలను అందించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 25 వేల మందికి పైగా ఉన్న కేబుల్ ఆపరేటర్ కుటుంబాలను ఆదుకొని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ధర్నాలో మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ సంక్షేమ సంఘం కన్వీనర్ పామ్మి సురేష్, సుభాష్ రెడ్డి, కిషోర్, కోటి, ఉపేందర్, అంజిరెడ్డి, రమేష్, జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.