Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆశ్రమ పాఠశాల విద్యార్థినుల రాస్తారోకో
- ఐటీడీఏకు ఉపాధ్యాయురాలు సరెండర్
నవతెలంగాణ -వెంకటాపురం
తమను మానసికంగా వేధింపులకు గురిచేస్తూ తమ తల్లిదండ్రులకు తప్పుడు సందేశాలు పంపిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న ఉపాధ్యాయురాలు తమకు వద్దని డిమాండ్ చేస్తూ ములుగు జిల్లా వెంకటాపురం మండలం చిరుతపల్లి-2 బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు సోమవారం పేరూరు-వెంకటాపురం ప్రధాన రహదారిపై బైటాయించి ఆందోళన చేపట్టారు. ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినీలను సెల్ఫోన్లో అసభ్యకరంగా చిత్రీకరిస్తూ.. తమ తల్లిదండ్రులకు తప్పుడు సమాచారం అందిస్తూ మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ఉపాధ్యాయురాలు రాజేశ్వరి వద్దని, డిప్యూటేసన్పై వెళ్లిన ప్రధానోపాధ్యాయులు నాగరాజును తిరిగి నియమించాలని డిమాండ్ చేశారు. రెండు గంటలకు పైగా విద్యార్ధులు ఆందోళన చేపట్టడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న బర్లడూడెం సర్పంచ్ కొర్సా నర్సింహమూర్తి, పోలీసులు విద్యార్దులకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. ఉన్నతాధి కారులతో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీనివ్వడంతో ఆందోళన విరమించారు. కాగా ఘటనపై ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయురాలిపై వెంటనే విచారణ చేపట్టాలని డిప్యూటీ డీఈఓ సారయ్య, ఏటీడీఓ దేశీరాం, ఏసీ ఎంఓ రవిందర్‌ను ఆదేశించారు. ఈమేరకు చిరుతపల్లి-2 ఆశ్రమ పాఠశాలలో విద్యార్దులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు సమక్షంలో సంఘటనపై విచారణ జరిపారు. ఉపాధ్యాయురాలు రాజేశ్వరిని ఐటీడీఏకు సరెండర్ చేస్తున్నట్టు తెలిపారు. డిప్యూటేషన్‌పై వెళ్లిన నాగరాజును నియమించేందుకు ఉన్నతాధికారులతో మాట్లాడుతామని అధికారులు హామీ ఇచ్చారు.