Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎస్ శాంతి కుమారి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన కంటి వెలుగు కార్యక్రంమలో భాగంగా ఇప్పటి వరకు 507 గ్రామ పంచాయితీలు, 205 మున్సిపల్ వార్డుల్లో కంటి వెలుగు శిబిరాలు పూర్తి చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. 12.29 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 2,94,462 మందికి రీడింగ్ గ్లాసులను అందచేయడంతోపాటు 2,05,334 మందికి కొత్తగా కండ్లద్దాల తయారీకి ప్రతిపాదనలు అందాయని చెప్పారు. సోమవారం హైదరాబాద్ బీఆర్కే భవన్ నుంచి జిల్లా కలెక్టర్లతో కంటి వెలుగు, ఉపాధ్యాయుల బదిలీలు, మన ఊరు-మన బడి, ఆయిల్ పామ్, కొత్తగా ప్రారంభించిన కలెక్టరేట్లలో కార్యాలయాల నిర్వహణ తదితర అంశాలపై ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్రంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తుండడం పట్ల జిల్లా కలెక్టర్లను సీఎఏస్ అభినందించారు. కంటి వెలుగులో ప్రతి రోజూ సుమారుగా 2 లక్షల మందికి పరీక్ష చేసి, 50 వేల కండ్లద్దాలను ఉచితంగా అందించామని వెల్లడించారు. కంటి వెలుగు క్యాంపులలో నిర్వహించే పరీక్షల వివరాలను మెడికల్ రికార్డులలో ఏ విధమైన పొరపాట్లు లేకుండా నింపాలని సూచించారు.
అత్యంత పారదర్శకంగా ఉపాధ్యాయ బదిలీలను చేపట్టాలి
సుదీర్ఘ కాలం తర్వాత చేపట్టే ఉపాధ్యాయ బదిలీలను అత్యంత పారదర్శకంగా, జవాబుదారీ తనంతో పూర్తి చేయాలని శాంతి కుమారి స్పష్టం చేశారు. ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు చేపట్టిన ఈ బదిలీల ప్రక్రియను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని పేర్కొన్నారు. పూర్తిగా ఆన్లైన్ విధానం ద్వారా జరిపే ఈ బదిలీల ప్రక్రియపై ఉపాధ్యాయుల నుంచి అందే ఫిర్యాదులు, దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా గ్రీవియన్స్ రిడ్రెసల్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి ఇప్పటివరకు 53 వేల దారఖాస్తులు అందాయనీ, ఇవి 75 వేల వరకు చేరే అవకాశం ఉందని తెలిపారు. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రతి రోజూ జిల్లా విద్యా శాఖాధికారులతో సమీక్షించాలని సీఎస్ కోరారు.
ఫిబ్రవరి 1 నుంచి మన ఊరు-మన బడి ప్రారంభోత్సవాలు
రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివద్ధి, బోధనేతర పరికరాల ఏర్పాటు తదితర సదుపాయాలు, మౌలిక సదుపాయాల కల్పనపై చేపట్టిన మన ఊరు - మనబడి కార్యక్రమంలో భాగంగా పూర్తయిన పాఠశాలలను ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి ప్రారంభించాలని ఆదేశించారు. ఈ మన ఊరు - మన బడి కార్యక్రమం ప్రారంభోత్సవాలు పండుగ వాతావరణంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పేరెంట్స్ లను పాల్గొనే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు.
ఆయిల్ పామ్ ప్లాంటేషన్ లో అగ్రగామిగా తెలంగాణ
ఆయిల్ పామ్ ప్లాంటేషన్ భాగంగా ప్రస్తుత సంవత్సరం రాష్ట్రంలో ఇప్పటి వరకు 57 వేల ఎకరాలలో ప్లాంటేషన్ ను చేపట్టడం ద్వారా దేశంలోనే ముందంజలో ఉన్నామని సీఎస్ వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటికే 57 వేల ఎకరాలలో ప్లాంటేషన్ పూర్తికాగా మరో 60 వేల ఎకరాలలో ప్లాంటేషన్ జరుగుతోందనీ, మార్చి నాటికి మొత్తం లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్లను ఆదేశించారు.
అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తరలించాలి
రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభించుకున్న 17 నూతన సమీకృత కలెక్టరేట్ కాంప్లెక్స్ లకు వారంలోగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తరలించాలని ఆమె స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, విద్యా శాఖ కమీషనర్ దేవసేన, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వీ, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ శ్వేతా మహంతి, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఉద్యానవన శాఖ ఇంచార్జ్ కమీషనర్ హనుమంత రావు, రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు తదితర అధికారులు పాల్గొన్నారు.