Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరస్పర భిన్నంగా కేంద్రమంత్రి, బండి సంజయ్ వ్యాఖ్యలు
- ఎన్సీఆర్బీ లెక్కలు వక్రీకరణ : ఎమ్మెల్సీ పల్లా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో లేని రైతు ఆత్మహత్యలున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చిత్రీకరిస్తున్నారని రైతు బంధు సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. సాక్షాత్తూ కేంద్ర మంత్రి తోమర్ రైతు ఆత్మహత్యలు తగ్గాయని చెబుతుంటే,, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పెరిగాయని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డు లెక్కలను కూడా వక్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్లోని బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 2014 నుంచి, రాష్ట్రంలో 400 శాతం ఆత్మహత్యలు తగ్గాయని చెప్పారు. వ్యవసాయ రంగంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ అని నిటిఅయోగ్, ఇండియా టుడే నివేదికలు స్పష్టం చేశాయని గుర్తు చేశారు. ఈ క్రమంలో ఆత్మహత్యలను ప్రోత్సహించేలా మాట్లాడొద్దని బీజేపీ నేతలకు హితవు పలికారు. బడ్జెట్ సమావేశాలు కచ్చితంగా జరుగుతాయనీ, నిబంధనల ప్రకారమే బడ్జెట్ ప్రవేశపెడతామని స్పష్టం చేశారు.
బీజేపీకి లొంగిన మాయావతి
తన అక్రమ సంపాదనపై విచారణ జరుగుతుందని భయపడిన మాయావతి యూపీలో కాన్షీరాం సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి బీజేపీ లొంగిపోయారనే బీయస్పీ రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ వ్యవహార శైలి ఉందని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు విమర్శించారు. విద్యావ్యవస్థను బాగు చేయాలని పదవినిస్తే రాజకీయం కోసం వాడుకున్న ప్రవీణ్ నిధులను దుర్వినియోగం చేసి స్వేరో వ్యవస్థను సృష్టించి భవిష్యత్ రాజకీయాల కోసం డబ్బులు కూడబెట్టుకున్నారని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రవీణ్ కుమార్ ఎవరికి వత్తాసు పలికారనే విషయం అందరికీ తెలుసన్నారు. దళితుల అభ్యున్నతి కోసం పని చేస్తున్న సీఎం కేసీఆర్ను విమర్శించే హక్కు ఆయనకు లేదన్నారు.ప్రభుత్వ విప్ ఎం.ఎస్.ప్రభాకర్ రావు మాట్లాడుతూ ప్రతిపక్షాల మాదిరిగానే రాష్ట్ర గవర్నర్ కూడా నిరాధార ఆరోపణలు చేస్తున్నారనీ, రాజకీయాలు చేయాలనుకుంటే సొంత రాష్ట్రానికి వెళ్లి చేసుకోవాలని హితవు పలికారు. ఎమ్మెల్సీ వి.గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ, కనీసం బీజేపీ తన చివరి బడ్జెట్ లోనైనా సరే బీసీలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.