Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీవో 17ను రద్దు చేయాలి : ఎన్పీఆర్డీ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్,కార్యదర్శి అడివయ్య
- రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నా
నవతెలంగాణ-సిటీబ్యూరో, మేడ్చల్ కలెక్టరేట్
రాష్ట్ర బడ్జెట్లో వికలాంగుల సంక్షేమం కోసం 5 శాతం నిధులు కేటాయించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకట్, ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య అన్నారు. ఆసరా పెన్షన్లకు మంజూరుకు ఆదాయ పరిమితి విధించే జీవో 17ను వెంటనే రద్దు చేయకుంటే ఉద్యమాన్ని ఉధృతం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్పీఆర్డీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేశారు. కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేశారు. మేడ్చల్ కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో కె.వెంకట్ పాల్గొనగా, హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద ధర్నాలో అడివయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాలుగా బడ్జెట్లో వికలాంగుల సంక్షేమం కోసం నిధులు కేటాయించడం లేదన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.89 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా పెన్షన్ రూ.10 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఆసరా పింఛన్ల మంజూరుకు ఆదాయ పరిమితి విధిస్తూ 2014లో జారీ చేసిన జీవో నెంబర్ 17ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దివ్యాంగుల వివాహ ప్రోత్సాహం కోసం 2021-22లో 711 మంది దరఖాస్తు చేసుకుంటే 271 మందికే మంజూరు చేశారని తెలిపారు. 2022 ఏప్రిల్ నుంచి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఇవ్వాలన్నారు. 2021-2022లో స్వయం ఉపాధి కోసం 829 మంది దరఖాస్తు చేసుకుంటే.. 386 మందికే రుణాలు మంజూరు చేశారని తెలిపారు. బ్యాంకు లింకేజి లేని రూ.50,000 రుణాలను మాత్రమే పంపిణీ చేసి, బ్యాంకు లింక్ చేసిన రుణాలను మంజూరు చేయడం లేదని చెప్పారు. 2022-23 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా రుణాల కోసం దరఖాస్తులు స్వీకరించడం లేదన్నారు.పరికరాల కోసం తెలంగాణ దివ్యాంగుల కో ఆపరేటివ్ కార్పొరేషన్లో 5000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేయాలనే నిబంధన సరికాదన్నారు. చదువుతో నిమిత్తం లేకుండా వైకల్య తీవ్రతను బట్టి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ మోటార్ వెహికల్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎన్పీఆర్డీ హైదరాబాద్ అధ్యక్షులు పి.శశికళ, కార్యదర్శి అర్.వెంకటేష్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు రంగారెడ్డి, హైదరాబాద్ సిటీ నాయకులు కుమార్, రాములు, మేడ్చల్ జిల్లా నాయకులు చంద్ర మోహన్, బాలయ్య, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.