Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తక్కువ సమయంలో దేశంలోనే పెద్ద ప్రాజెక్ట్ కాళేశ్వరం పూర్తి
- పరిశ్రమల ఏర్పాటుతో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు: ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-తూప్రాన్ రూరల్, మనోహరాబాద్
రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని రకాల సహాయ, సహకారాలు అందిస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత అతి స్వల్ప వ్యవధిలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేసి అద్భుత విజయాలు సాధించామన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో రూ.450 కోట్లతో 59 ఎకరాల విస్తీర్ణంలో 16.5 లక్షల చదరపు అడుగుల బిల్డ్ ఏరియాలో నిర్మించిన ఐటీసీ అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ అండ్ లాజిస్టిక్స్ ఫెసిలిటీని మంత్రి కేటీఆర్ ఐటీసీ లిమిటెడ్ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్‌పురి సమక్షంలో సోమవారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో ఇంత పెద్ద పరిశ్రమ రావడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరో రూ.350 కోట్లతో ఉత్పత్తి సామర్థాన్ని పెంచనుందన్నారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు కంపెనీ తయారు చేసే చిప్స్, బిస్కెట్స్ కోసం ఆలుగడ్డలు, గోధుమలు ఇక్కడే కొనాలని, దాంతో ఇక్కడి రైతులకు ఆర్థిక అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. సమాజంలో మెరుగైన విద్యా, వైద్య తదితర రంగాల్లో సహకార మందించడానికి ఐటీసీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎస్ఆర్ నిధులను కేటాయించాలని సూచించారు. కంపెనీ కోసం భూములు కోల్పోయిన వారిని ఆదుకునే బాధ్యత మనపై ఉందని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని తక్కువ సమయంలో పూర్తి చేసి నీటి వనరుల్లో విప్లవం సాధించామన్నారు. పరిశ్రమలకు కాళేశ్వరం ద్వారా 10 టీఎంసీల నీటిని అందిస్తున్నామన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ కోసం స్పెషల్ సెజ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 68 లక్షల నుంచి మూడున్నర కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించే స్థాయికి ఎదిగామన్నారు. రైతుల ఆదాయం పెరగాలంటే వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలు అభివృద్ధి చెందాలని, ఆ దిశగా దృష్టి పెట్టామని తెలిపారు. వంట నూనెల పంటలను ప్రోత్సహిస్తూ వచ్చే ఐదేండ్లలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేయడం ద్వారా ఇతర దేశాల నుంచి వంట నూనెల దిగుమతిని తగ్గించడంపై దృష్టి సారించామన్నారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రాకల హేమలత శేఖర్ గౌడ్, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, ఐటీసీ పరిశ్రమ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.