Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమగ్ర చట్టంపై సర్కారు మాటలు ఏమయ్యాయి? :ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ
నవతెలంగాణ-అడిక్‌మెట్
అనాథలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలును అమలు చేయాల్సిందేనని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. అనాథ హక్కుల పోరాట వేదిక (ఎంఎస్పీ, ఎమ్మార్పీఎస్ తెలంగాణ) ఆధ్వర్యంలో ''అనాథల అరిగోస- 777 మూవ్మెంట్'' పేరిట సోమవారం ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా దీక్ష సోమవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు మద్దతు పలికారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాట్లాడుతూ.. అనాథలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడేండ్ల కింద ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. అనాథ పిల్లల కోసం మొదటి రెసిడెన్షియల్ పాఠశాలను యాదగిరిగుట్టలోనే నిర్మిస్తామని, రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి విఫలమయ్యారన్నారు. దేశం గర్వించే విధంగా అనాథల కోసం సమగ్ర చట్టం తెస్తామని మంత్రి కేటీఆర్ చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నిం చారు. అనాథల కోసం చట్టంపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించి, ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. మంత్రివర్గం ఉప సంఘం చేసిన 8 తీర్మానాల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదని విమర్శించారు. దేశంలో ప్రతి నిర్ణయమూ ఓటు కోసమే అమలవుతున్న దన్నారు. అనాథల చట్టం కోసం రేపటి నుంచే కార్యాచరణ చేపట్టబోతున్నామని, హామీలు ఇచ్చిన సమయంలో కేసీఆర్, కేటీఆర్ వెంట ఎవరెవరు ఉన్నారో వారందరినీ పది మంది అనాథ పిల్లలను తీసుకెళ్లి కలుస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు దీక్ష సమయంలో నిమ్మ రసం ఇచ్చిన ఇద్దరిలో తాను ఉన్నానని, కానీ నేడు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్నారు. చట్టం తీసుకురాకపోతే ఇలాంటి దీక్షలు ప్రతి జిల్లా కేంద్రాల్లో నిరంతరం కొనసాగుతాయని చెప్పారు. మంత్రి మల్లారెడ్డిలాంటి ధనవంతులకు కోట్ల రూపాయలు అందే రైతుబంధు రద్దు చేస్తే అనాథ పిల్లలను ఆదుకోవచ్చు కదా అన్నారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. అనాథ పిల్లల కోసం నిర్వహించే ఎలాంటి దీక్షలకైనా సీపీఐ(ఎం) తరపున మద్దతు తెలుపుతామన్నారు. సీఎం కేసీఆర్ దళితులకు మూడెకరాలు భూమి ఇస్తానని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చి మరిచారన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దళితబంధు కూడా సమగ్రంగా అమలు కావడం లేదన్నారు. టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ.. అనాథ పిల్లలకు ఇచ్చిన మాటను మరిచిపోయే తత్వం కేసీఆర్‌ది అని విమర్శించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, వైఎస్సార్టీపీ నాయకుడు ఏపూరి సోమన్న, బీజేపీ నాయకులు విజయ, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఇందిరా శోభన్ తదితరులు మాట్లాడారు. సీఎం కేసీఆర్ సచివాలయం పేరుతో, రైతు బంధు పేరుతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. అనాథ హక్కుల పోరాట వేదిక కార్యనిర్వాహక అధ్యక్షుడు బి.వెంకటయ్య, ప్రదీప్, రాజు తదితరులు దీక్షలో కూర్చున్నారు.