Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు మృతి .. ఒకరికి గాయాలు
- మూడు నెలల్లో రెండో ప్రమాదం
- మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కార్మిక సంఘాల ఆందోళన
- న్యాయం చేస్తామన్న యాజమాన్యం
నవతెలంగాణ - మఠంపల్లి
సిమెంట్ పరిశ్రమలో పెద్ద ప్రమాదం జరిగింది. ఇద్దరు కార్మికులు ప్రాణం కోల్పోయారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలోని గ్రేగోల్డ్ సిమెంట్ పరిశ్రమలో జరిగింది. ఇందుకు సంబంధించి తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం..
మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన మునగపాటి సైదులు(46), పట్టేటి సాయి(23), మల్లెబోయిన సైదులు పరిశ్రమలో రోజు మాదిరిగా కిలన్ దగ్గర పని చేస్తున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా కిలన్ బ్యాక్ ఫైర్ కావడంతో తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే హుజూర్గర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మునగపాటి సైదులు పరిస్థితి విషమించి మృతిచెందాడు. సాయిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. సైదులు కోదాడలో చికిత్స పొందుతున్నాడు. మూడు నెలల కింద కూడా కిలన్ వద్ద ఇదే మాదిరి ప్రమాదం జరిగింది. అప్పుడు రెడపంగ రైతులు మృతిచెందాడు. ఈ ఘటనతో గ్రామస్థులు, కార్మికసంఘాల నేతలు, కుటుంబ సభ్యులు పరిశ్రమ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని, మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. చివరకు యాజమాన్యం కుటుంబసభ్యులను, గ్రామపెద్దలను, కార్మికసంఘాల నేతలను చర్చలకు పిలిచింది. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికైనా పరిశ్రమలో మళ్లీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు చేపట్టాలని కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ బీఆర్ఎస్కేవీ నాయకులు వట్టెపు సైదులు, పచ్చిపాల ఉపేందర్, మాలోతు బాలునాయక్, రన్మియా తదితరులు పాల్గొన్నారు.