Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 12 రకాల మౌలిక సదుపాయాల కల్పన
- నేడు 'మన ఊరు-మన బడి' తొలి దశ పాఠశాలలు ప్రారంభం
- మిగతా స్కూళ్లలో పనులు పూర్తయ్యేదెన్నడో..
నవతెలంగాణ- మొఫిసిల్ యంత్రాగం
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ''మన ఊరు-మన బడి'' మొదటి విడత పాఠశాలలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. తొలి దశలో పనులు పూర్తయిన పాఠశాలలు బుధవారం ప్రారంభం కాబోతున్నాయి. తరగతి గదులు, టాయిలెట్స్, తాగునీరు, డ్యూయల్ డెస్కులు, గ్రీన్‌చాక్ బోర్డు, కిచెన్‌షెడ్డు ఏర్పాటుతో పాటు బడికి అందమైన రంగులు వేసి ముస్తాబు చేశారు. దీనికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని గంభీరావుపేటలో పాఠశాలను మంత్రులు కేటీ రామారావు, పి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభిస్తారు. నల్లగొండ జిల్లా మునుగోడులో మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారు. కార్పొరేట్ స్కూల్స్‌కు దీటుగా అన్ని సౌకర్యాలను ప్రభుత్వ స్కూళ్లల్లో కల్పించినట్టు మంత్రి సబిత తెలిపారు.రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం తీసుకొచ్చిన పథకం మన ఊరు-మన బడి-మన బస్తీ. రాష్ట్రంలోని 26,065 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య, నమోదు, హాజరుతోపాటు పాఠశాల విద్యను ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించేందుకు వసతులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 2021-22 బడ్జెట్లో రూ.7,289 కోట్లు కేటాయించింది. తొలి దశలో భాగంగా 9 వేలకు పైగా స్కూళ్లలో 12 రకాల మౌలిక సదుపాయల కల్పనకు రూ.3,497 కోట్లు కేటాయించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ స్కీమ్‌ను 'మన ఊరు-మన బడి' పేరుతో అమలు చేస్తుండగా.. పట్టణ ప్రాంతాల్లో 'మన బస్తీ-మన బడి' పేరుతో పనులు చేపట్టారు. 2022 మార్చిన 8న వనపర్తి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభించారు. మూడు దశల్లో మూడేండ్లపాటు విద్యా శాఖ పరిధిలో ఉన్న అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకోగా.. అందులో కొన్ని పాఠశాలల్లో వందశాతం పనులు పూర్తయ్యాయి. మరికొన్ని పాఠశాలల్లో వివిధ దశల్లో ఉన్నాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే..
ఉమ్మడి ఆదిలాబాద్‌లో 120 పాఠశాలలు ఆధునీకరణ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 35శాతం పాఠశాలను తొలిదశ కింద ఆధునీకరించేందుకు నిర్ణయించగా.. మండలానికి రెండు పాఠశాలల చొప్పున మోడల్ స్కూల్స్‌గా పరిగణనలోకి తీసుకొని అభివృద్ధి చేశారు. సుమారు 120 పాఠశాలల్లో ప్రభుత్వం సూచించిన 12అంశాలను మెరుగుపర్చారు.
ఉమ్మడి రంగారెడ్డి
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 'మొదటి విడతలో 817 పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందులో రంగారెడ్డి జిల్లాలో 446 ఉండగా, వికారాబాద్‌లో 371 ఉన్నాయి. మోడల్ స్కూళ్ల పేరుతో మొదటగా మండలానికి రెండు స్కూళ్లను ఎంపిక చేయాలని ప్రభుత్వం సూచించడంతో వికారాబాద్ 37 పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందులో ప్రస్తుతం 14 పాఠశాలల నిర్మాణాలు పూర్తయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 54 స్కూళ్లను ఎంపిక చేయగా, ఇందులో ప్రస్తుతం 23 పూర్తయ్యాయి. ఇవి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.
నల్లగొండ జిల్లాలో మొదటి విడతలో 517 పాఠశాలలను ఎంపిక చేశారు. మండలానికి రెండు పాఠశాల చొప్పున 62 మోడల్ పాఠశాలలు ఉన్నాయి. ఇప్పటివరకు 19 పాఠశాలలు పూర్తయ్యాయి. ఇందులో 13 పాఠశాలలు ఫిబ్రవరి ఒకటి, రెండో తేదీల్లో ఎమ్మెల్యేల చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. మునుగోడు మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్ ప్రాథమిక పాఠశాలను ప్రారంభించనున్నారు. సూర్యాపేట జిల్లాలో 92 పాఠశాలల ప్రాజెక్టు వర్క్ పూర్తి అయింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 251 పాఠశాలలు ఎంపిక చేశారు. భువనగిరి పట్టణ కేంద్రంలోని గాంధీనగర్ ప్రాథమిక పాఠశాలను ప్రారంభించనున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 3136 ప్రభుత్వ పాఠశాలున్నాయి. 82 పాఠశాలలను ఆధునీకరించారు. సిద్దిపేట జిల్లాలో 976 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. 241 పాఠశాలల్లో పనులు మొదలై వివిద దశల్లో కొనసాగుతున్నాయి. 35 పాఠశాలల్లో 100 శాతం పనులు పూర్తయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో 1262 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. తొలుత వంద శాతం పనులు పూర్తయిన 13 పాఠశాలల్ని ప్రారంభించనున్నారు. మెదక్ జిల్లాలో 898 ప్రభుత్వ పాఠశాలున్నాయి. 33 పాఠశాలల్లో వంద శాతం పనులు పూర్తయినందున నేడు ప్రారంభించనున్నారు.
హైదరాబాద్ జిల్లాలో మొదటి విడుతలో 239 పాఠశాలలను విద్యాశాఖ గుర్తించింది. గుర్తించిన 239 పాఠశాలలో వివిధ కారణాల వల్ల(అద్దె భవనాలు 25, ఒకే ప్రాంగణంలో నిర్వహిస్తున్న పాఠశాలలు) పలు పాఠశాలల్లో పని ప్రారంభించలేకపోయారు. జిల్లాలోని 16 మండలాల్లో కలిపి 156 పాఠశాలల్లో పని ప్రారంభించారు. ఇందులో రెండు స్కూళ్లు మెహబూబియా గర్ల్స్, ప్రభుత్వ మోడల్ హైస్కూల్ ఆలియా బార్సు స్కూళ్లను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి పనులు పూర్తి చేశారు. జీపీఎస్ లక్ష్మీనగర్ పికెట్, జీపీఎస్ మైలార్‌గూడ, జీపీఎస్ రాజ్‌భవన్ పాఠశాలలను మంత్రి శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించనుండగా.. మరో నాలుగు స్కూళ్లు ఎమ్మెల్యేల చేత ప్రారంభించనున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 120 పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయి.
నిజామాబాద్ జిల్లాలో మొత్తం 1200 స్కూళ్లున్నాయి. ఎంపికైన 407 స్కూళ్లను రెండు రకాలుగా విభజించారు. 30 లక్షల లోపు బడ్జెట్ అవసరమయ్యే స్కూళ్లు.. ఆపై బడ్జెట్ ఖర్చు చేయాల్సిన స్కూళ్లుగా విభజించారు. రూ.30 లక్షలలోపు బడ్జెట్లో 295 స్కూళ్లు ఉన్నాయి. ఈ 295 స్కూళ్లలోనే మెజార్టీ స్కూళ్లలో పనులు ప్రారంభమయ్యాయి. కొన్ని పూర్తయ్యాయి. మొదటి విడత పనులు ఇంత నెమ్మదిగా జరిగితే.. మిగిలిన స్కూళ్లలో పనులు ఎప్పుడు పూర్తి చేస్తారన్నది ప్రశ్నగా మిగిలింది.