Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బండి, ఈటల ఢిల్లీ నుంచి నయాపైసా తీసుకొచ్చారా?
- నిధులు పారిస్తానని ప్రగల్భాలు పలికి.. రూపాయి తేలే..
- ఈ దేశానికి బీజేపీనే అరిష్టం
- తండ్రిలాంటి నాయకుని పట్టుకుని నిందలా? : ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
- కమలాపూర్‌లో విద్యార్థులతో కలిసి భోజనం
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి / జమ్మికుంట/కమలాపూర్
'తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పేరు మాత్రమే మారింది. పార్టీ గుర్తు, డీఎన్ఏ పాతదే. బండి సంజయ్, ఈటల రాజేందర్ ఢిల్లీ నుంచి నయా పైసా తీసుకొచ్చారా? చేసే పని ఏమీ లేక, చేయాల్సిన పని చేయకుండా మా ప్రభుత్వంపై బురదజల్లే పనే పెట్టుకున్నారు. ఈ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఈటల రాజేందర్‌ను పరిచయం చేసి ఇంతటి నాయకునిగా ఎదిగే అవకాశం కల్పించింది కేసీఆర్ కాదా?. తండ్రిలా రాజకీయ జీవితాన్ని ఇచ్చిన కేసీఆర్ పాలన అరిష్టమంటూ ఈటల మాట్లాడటం సిగ్గు చేటు' అని ఇటు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం జిల్లా కేంద్రంలోని కేసీఆర్ సర్క్యూట్ రెస్ట్‌హౌజ్ (కేసీఆర్) భవనాన్ని, పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కమలాపూర్, జమ్మికుంటలో పర్యటించారు. జమ్మికుంటలో నిర్వహించిన సభలో మంత్రి ప్రసంగించారు.
'14 నెలల కిందట జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను గెలిపించారు. రూ.3వేల పింఛన్ ఇస్తామన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను తీసుకొచ్చి నియోజకవర్గానికి నిధులు పారిస్తామని ప్రగల్భాలు పలికారు. ఆ రోజు ఈటల చెప్పిన మాటలు ఏమయ్యాయి. కనీసం రూపాయి తీసుకురాలేదు' అని ఈటల రాజేందర్‌పై మంత్రి విమర్శలు గుప్పించారు. 2004లో ఇదే నియోజకవర్గం నుంచి 33 మంది పోటీ పడితే ఈటలకు కేసీఆర్ టికెట్ ఇచ్చి రాజకీయ జన్మ ఇచ్చారని చెప్పారు. తల్లిపాలు తాగి రొమ్ముగుద్దినట్టు.. తండ్రిలాంటి కేసీఆర్‌ను, ఆయన ప్రభుత్వాన్ని అరిష్టమంటూ మాట్లాడటం తగునా? అని ప్రశ్నించారు. ఈ దేశానికి అరిష్టం బీజేపీ, ఆ పార్టీ నేతలే అంటూ విమర్శించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని కేంద్రంలోని బీజేపీ సర్కారు మాట ఇచ్చిందన్నారు. జన్‌ధన్ ఖాతాల్లో కూడా రూ.15లక్షలు వేస్తామన్నారని, చివరికి దేశ ప్రజల సంపదనంతా సంపన్నులకు దోచిపెడుతున్నారని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ అన్ని రకాల వస్తువులపైనా, సేవల పైనా జీఎస్టీ బాదుతూ ఆ పన్నుల రూపేణా వచ్చిన ఆదా యాన్ని ఏం చేశారని ప్రశ్నించారు. ప్రజల సొమ్ములతోనే హైవేలు నిర్మిస్తే టోల్‌చార్జీలు ఎందుకు వసూలు చేస్తు న్నారని ప్రశ్నించారు. 8ఏండ్లలో రూ.100లక్షల కోట్ల అప్పులు చేసిన మోడీని పట్టుకుని ఇక్కడి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దేవుడు అంటూ కొనియాడుతున్నారని, అసలు మోడీ ఎవరికి దేవుడు.. ఎందుకు దేవుడు ? అని ప్రశ్నించారు. గిరిజనులకు 6 నుంచి 10 శాతం రిజర్వేషన్లను కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానిస్తే మోడీ ప్రభుత్వం ఊసెత్తడం లేదని అన్నారు. 'ఢిల్లీలో ఏడాది పాటు నిరసన చేపట్టిన రైతుల్లో 700 మంది రైతులు చనిపోయినందుకా? లేక ఆకాశంలో అప్పులు.. పాతాళంలో రూపాయి ఉన్నం దుకా? దేవుడు అంటూ ఎద్దేవా చేశారు. గుజరాతీల చెప్పులు నెత్తిన పెట్టుకునే ఇక్కడి వ్యక్తికి తెలంగాణ ఆత్మాభిమానం ఉందా? అని ప్రశ్నించారు.
హుజూరాబాద్‌కు వరాలు
జమ్మికుంట డిగ్రీ కళాశాల మైదానంలో స్టేడియం నిర్మాణానికి రూ.10కోట్లు, హుజూరాబాద్ క్రీడా ప్రాంగణానికి రూ.10కోట్లు ప్రకటించారు. ఇల్లందకుంట దేవస్థాన అభివృద్ధికి, వీణవంక మండలానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు..
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. హన్మకొండ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల, బాలుర రెసిడెన్షియల్ విద్యార్థులతో కలిసి మంత్రి కేటీఆర్ భోజనం చేశారు. విద్యార్థినులతో ముచ్చటించారు. అమ్మాయిలు గట్టిగా అడగాలని, మీరు అడిగితేనే ఏం చేయాలన్నది తమకు తెలుస్తుందని సూచించారు. ఈ కార్యక్రమాల్లో ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్‌కుమార్, మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ని ఎన్ఎస్యూఐ అడ్డగింత
కమలాపూర్ మండల కేంద్రంలో మంత్రి కాన్వాయ్కి అడ్డంగా దూసుకొచ్చారు. ఈ క్రమంలో ఆగ్రహించిన బీఆర్ఎస్ నేతలు వారిపై పోలీసుల సమక్షంలోనే దాడి చేశారు. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. మంత్రి పర్యటనను అడ్డుకుంటారనే నెపంతో పలువురు కాంగ్రెస్ నేతలను సోమవారం రాత్రి అదుపులోకి తీసుకొని మడికొండ పోలీసు ట్రైనింగ్ కాలేజీకి తరలించారు.