Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంటల బీమా, రుణమాఫీకి అమలుకు డిమాండ్
- రైతుల భారీ ప్రదర్శన.. కలెక్టరేట్ ఎదుట ధర్నా : రైతులను ఆదుకోవాలి : పోతినేని
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కరెంట్ కోతలు, పంటల బీమా, రుణమాఫీ తదితర సమస్యలపై తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు మంగళవారం ఖమ్మంలో పెద్దఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఆర్డీవో కార్యాలయం నుంచి నూతన కలెక్టరేట్ వరకు రైతులు భారీ ప్రదర్శనగా వెళ్లి నూతన కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట బైటాయించారు. కరెంటు కోతలు ఎత్తివేసి పగటిపూట నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని, ఎండిపోతున్న పంటలను కాపాడాలని కోరారు.
ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు, ఖమ్మం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడారు. రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో యాసంగి సీజన్లో లక్ష ఎకరాల్లో మొక్కజొన్న సాగు అయిందన్నారు.
కరెంటు కోతలతో మక్కతో పాటు వరి, మిర్చి పంటలు ఎండిపోతున్నాయన్నారు. పది రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నట్టు ప్రకటిస్తుంటే.. మరోవైపు ట్రాన్స్‌కో, జెన్కో సీఎండి ప్రభాకరరావు త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరాలో నియంత్రణ చేస్తామని, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఆటో స్టార్టర్లు బిగిస్తామని ప్రకటన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎండీ ప్రకటనతోపాటు విద్యుత్ కోతలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పంటల బీమా పథకంలో లోపాలు ఉన్నాయనే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం సమగ్ర పంటల బీమా పథకం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
అందుకు అవసరమైన నిధులు రాష్ట్ర బడ్జెట్లో కేటాయించాలని కోరారు. గత రెండు సీజన్లలో జిల్లాలో లక్షల ఎకరాల్లో మిర్చి పంట తామర వైరస్, వేరుకుళ్లుడుతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. దెబ్బతిన్న మిర్చికి ఎకరాకు లక్ష రూపాయల పరిహారం అందించాలని కోరారు. రైతు రుణమాఫీ అమలు చేయకపోవడం వల్ల ఆధిక వడ్డీ భారం రైతుపై పడుతోందని చెప్పారు. ఈ బడ్జెట్లో నిధులు కేటాయించి రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సీజన్ ఆరంభం నుంచి పత్తి ధర తగ్గిందన్నారు. క్వింటాల్ రూ.6వేలు కూడా లేకపోవడంతో పత్తిని మార్కెట్లో అమ్ముకోలేక రైతులు ఇండ్లల్లోనే నిల్వ ఉంచారన్నారు. క్వింటాల్‌కు రూ.12 వేల ధర నిర్ణయించి సీసీఐ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు నున్నా నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు మాదినేని రమేష్, ఉపాధ్యక్షులు తాతా భాస్కరరావు, వాసిరెడ్డి ప్రసాద్, సహాయ కార్యదర్శులు చింతనిప్పు చలపతిరావు, ఎస్కే మీరా, దుగ్గి కృష్ణ, శీలం పకీరమ్మ, బిక్కసాని గంగాధర్, భూక్యా లక్ష్మా, తూళ్ళూరి రమేష్, చెరకుమల్లి కుటుంబరావు, ఉమా, సుదర్శన్ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.