Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్ బోర్డు, కమిషనరేట్లోకి రాకుండా ఆంక్షలు : నవీన్ మిట్టల్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్ బోర్డు, ఇంటర్ కమిషనర్ కార్యాలయాల్లోకి రాకుండా సస్సెండైన ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి మధుసూదన్‌రెడ్డిపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి, ఇంటర్ విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. మహిళా ఉద్యోగుల రక్షణ, ప్రభుత్వ దస్త్రాల భద్రత కోసమే ఈ ఆంక్షలను విధించినట్టు స్పష్టం చేశారు. ఇంటర్ కమిషనరేట్‌లో సీసీ కెమెరాల ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారంటూ ఆయనపై సోమవారం బేగంబజార్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైందని వివరించారు. అలాంటి వ్యక్తి తమ కార్యాలయాల్లోకి రాకుండా ఆదేశాలిచ్చామని తెలిపారు. సరూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఎకనామిక్స్ అధ్యాపకునిగా పనిచేస్తున్న మధుసూదన్‌రెడ్డి సస్పెన్సన్‌లో కొనసాగుతున్నారని పేర్కొన్నారు. వివిధ నేరారోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన్ను గతంలోనే సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. ఆయనపై మహిళా అధికారిని లైంగికంగా వేధించిన కేసు నమోదైందని వివరించారు. దీంతో తమ కార్యాలయాల్లోకి అతను ప్రవేశిస్తే కుట్రపూరితంగా నేరంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది అధికారులతో నేరుగా గానీ, పరోక్షంగా గానీ మాట్లాడేందుకు ప్రయత్నించినా నేరపూరిత చర్యగానే పరిగణిస్తామని ఆదేశాల్లో ప్రకటించారు. అయితే నవీన్ మిట్టల్ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ కావడం చర్చనీయాంశంగా మారింది.
ఇది అవివేకం : మధుసూదన్‌రెడ్డి
ఇంటర్ బోర్డు, కమిషనర్ కార్యాలయాల్లోకి తనను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అవివేకమని ఇంటర్ విద్యా జేఏసీ చైర్మెన్ పి మధుసూదన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
అక్రమంగా నియామకం పొంది కోర్టు ఉత్తర్వుల ద్వారా కొనసాగుతున్న ఒక మహిళా ఉద్యోగి అభ్యర్థన మేరకు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదని పేర్కొన్నారు. అధ్యాపకుల వాణిని వినిపించే అవకాశాన్ని కాలరాయడం నవీన్ మిట్టల్ అహంకారానికి నిదర్శనమని ఆరోపించారు.