Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్ విద్యార్థులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలి : ఎస్ఎఫ్ఐ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనంలో ఒకేసారి ఆన్లైన్ విధానం చేపట్టొద్దని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. విద్యార్ధులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఇంటర్ జవాబు పత్రాలకు సంబంధించి ఒకేసారి అన్ని పేపర్లనూ ఆన్లైన్ మూల్యాంకనం చేపట్టాలన్న ఇంటర్ బోర్డు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 35 లక్షల జవాబు పత్రాలను ఈ పద్ధతిలో మూల్యాంకనం చేయడం వల్ల పొరపాట్లు జరిగే అవకాశం లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో గ్లోబరీనా సంస్థ టెండర్ తీసుకున్న సందర్భంలో మాన్యువల్ పద్ధతిలో మూల్యాంకనం చేస్తేనే ఫలితాల్లో గందరగోళం ఏర్పడి విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో సరైన శిక్షణ లేకుండా అన్ని పేపర్లు దిద్దడానికి కంప్యూటర్లతోపాటు అవకాశాలపై అవగాహన కల్పించకుండా మూల్యాంకనం చేయడమంటే విద్యార్థులు నష్టపోయే అవకాశముందని తెలిపారు. విద్యాశాఖ మంత్రి కేవలం లాంగ్వేజ్ సబ్జెక్టులకే ఆన్లైన్ మూల్యాంకనం చేపడతామంటూ ప్రకటించారని పేర్కొన్నారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి మాత్రం లాంగ్వేజ్లతోపాటు ఆర్ట్స్, కామర్స్ (హ్యుమానిటీస్), ఒకేషనల్ సబ్జెక్టుల జవాబు పత్రాలకు కూడా ఆన్లైన్ మూల్యాంకనం చేపడతామని ప్రకటించారని వివరించారు. ప్రస్తుతానికి ఆన్లైన్ మూల్యాంకనాన్ని లాంగ్వేజ్ సబ్జెక్టు వరకే పరిమితం చేసి భవిష్యత్లో దశలవారీగా విస్తరించాలని వారు సూచించారు. విద్యార్థులకు నష్టం లేని చర్యలు తీసుకోవాలని కోరారు.