Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు బిల్డర్స్, మరో ఫార్మా కంపెనీపై కొనసాగుతున్న ఐటీ సోదాలు
- 50 ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులు
నవతెలంగాణ - ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్రంలో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపాయి. ముఖ్యంగా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామ్ రెడ్డి నివాసం, కార్యాలయాలతో పాటు మరో ఇద్దరు బిల్డర్లు, ఒక ఫార్మా కంపెనీలపై కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఇటీవలన పలు ఫార్మా కంపెనీలు, బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలపై దాడులు సాగించిన ఆదాయపు పన్ను శాఖ తాజాగా ఎమ్మెల్సీ వెంకట్ రామ్ రెడ్డికి చెందిన రాజ్‌పుష్ప బిల్డర్స్ కంపెనీపై మంగళవారం ఉదయం నుంచి దాడులు కొనసాగిస్తున్నది. దీంతో పాటు ముప్పా బిల్డర్స్, వర్టెక్స్ బిల్డర్స్, వసుధ ఫార్మాస్యూటికల్ కంపెనీ సంస్థల పైన ఐటీ అధికారులు దాడులు నిర్వహించి సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన దాదాపు 50 మందికి పైగా ఐటీ అధికారులు బృందాలుగా విడిపోయి ఈ దాడులు కొనసాగిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లోని వెంకట్రామ్ రెడ్డి నివాసంతో పాటు హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే, గచ్చిబౌలిలోని ముప్పా బిల్డర్స్ కార్పొరేటు కార్యాలయంతో పాటు నార్సింగిలో ముప్పా బిల్డర్స్ నిర్మించిన పలు విల్లాలు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు సాగుతున్నాయి. అలాగే, మాదాపూర్‌లోని వసుధ ఫార్మాస్యూటికల్ కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఐటీ అధికారుల సోదాలు సాగుతున్నాయి. వసుధ ఫార్మాస్యూటికల్‌కు చెందిన మరో పదిహేను కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు క్షుణ్ణంగా సోదాలు నిర్వహిస్తున్నారు. పై కంపెనీలకు చెందిన ఎండీలతో పాటు సీఈఓలు, ఇతర అధికారుల నివాసాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున విల్లాల నిర్మాణాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, కొత్త కొత్త వెంచర్లు వేయటం వంటి కార్యక్రమాలు సాగిస్తున్న ఈ సంస్థలు భారీ మొత్తంలో ఆదాయపు పన్ను ఎగవేతకు పాల్పడ్డట్టూ ఐటీ అధికారులు ఆరోపిస్తున్నారు. గతంలో కొన్ని రియల్ఎస్టేట్ వ్యాపార సంస్థలపై తాము జరిపిన దాడుల్లో లభించిన ఆధారాల మేరకు రాజ్‌పుష్ప, వర్టెక్స్, ముప్పా, వసుధ సంస్థలపై దృష్టిని సారించిన ఐటీ అధికారులు ఒకేసారి ఈ సంస్థల కార్యాలయాలపై మెరుపు దాడులకు వ్యూహరచన చేసి అమలు చేసినట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీని ప్రశ్నించి ఆయన ఆస్థులు, ఇతర వ్యాపారాల గురించి ఐటీ అధికారులు ఆరా తీసినట్టు తెలిసింది. ఈ దాడులలో ఐటీ అధికారులు పెద్ద ఎత్తున ఆయా సంస్థల నిర్మాణాలకు సంబంధించిన పత్రాలు, భూముల కొనుగోలుకు సంబంధించిన పత్రాలు, ఇతర వ్యాపారాలలో భారీగా పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకు న్నట్టు తెలిసింది. అయితే, ఈ దాడులలో నగదు, నగలను ఇంత వరకు తాము స్వాధీనం చేసుకోలేదని ఐటీ వర్గాలు తెలిపాయి. అయితే, ఈ దాడులు పూర్తి కాలేదనీ, మరో రెండ్రోజుల పాటు కొనసాగే అవకాశమున్నదని ఐటీ వర్గాలు వెల్లడించాయి. లభించిన బిల్డర్ల ఆస్థులకు సంబంధించిన పత్రాలు, డాక్యుమెంట్ల విలువ కోట్లాది రూపాయల్లోనే ఉంటుందని ఐటీ వర్గాలను బట్టి తెలుస్తున్నది. ఐటీ అధికారులు దాడులు సాగించిన సమయంలో వారి కార్యాలయాల్లోకి వెళ్లనీయకుండా ఆయా సంస్థల సెక్యూరిటీ సిబ్బంది అడ్డుపడింది. అయితే ఐటీ అధికారుల వెంబడి వచ్చిన సీఆర్పీఎఫ్ సిబ్బంది సిబ్బంది అడ్డును బలవంతంగా తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.