Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10,500 జీతంతో కుటుంబాన్ని పోషించలేకపోతున్నా
- సీఎం కేసీఆర్కు డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఏ కర్ణకంటి రాజేశ్ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన. రెవెన్యూ శాఖలో కేవలం రూ.10,500 జీతంతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఏగా విధులు నిర్వర్తిస్తున్నాను. పదేండ్లయినా ప్రమోషన్ రాలేదు. ఆ జీతంతో కుటుంబాన్ని పోషించటం భారమవుతున్నది. పదోన్నతి కల్పించి న్యాయం చేయండి' అంటూ సీఎం కేసీఆర్కు వరంగల్ జిల్లా నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామానికి చెందిన డైరెక్ రిక్రూట్మెంట్ వీఆర్ఏ కర్ణకంటి రాజేశ్ లేఖ రాశారు. ఆ లేఖ ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నది. లేఖలోని అంశాలు ఇలా ఉన్నాయి.' నేను అనగా కర్ణకంటి రాజేశ్ తండ్రి కీర్తి శేషులు నారాయణ. రెవెన్యూ శాఖలో వీఆర్ఏగా విధులు నిర్వర్తిస్తున్నాను. ఉద్యమాల గడ్డ కాకతీయ విశ్వవిద్యాలయం క్యాంపస్లో పీజీ(యం.కామ్) చేస్తూ 2009 నుంచి 12 వరకు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాను. 2012లో ఏపీపీఎస్సీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ రాత పరీక్ష ద్వారా వీఆర్ఏగా నియామకం అయ్యాను. ఐదేండ్లలో పదోన్నతి వస్తుందని ఆశించి జాబ్లో జాయిన్ అయ్యా. పదేండ్లయినా పదోన్నతి రాలేదు. నేను ఉమ్మడి వరంగల్ జిల్లా 2020లో వీఆర్వో పదోన్నతి కోసం ప్రచురించిన సీనియారిటీ తుది జాబితాలో ఉన్నాను. కానీ, మీరు ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ చట్టంతో వీఆర్వో వ్యవస్థ రద్దయింది. దీంతో పదోన్నతి కోల్పోయాను. నాకు ఏడాది వయస్సున్నప్పుడు మా నాన్న మరణిస్తే కష్టపడి పెంచిన తల్లికి, నన్ను నమ్ముకుని వచ్చిన భార్యకి నా పిల్లలకి పౌష్టికాహారం, మెరుగైన వైద్యం, విద్య, వారికి కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించలేకపోతున్నాను. ఆరోగ్య, ఆర్థిక, మానసిక పరిస్థితులతో నా కుటుంబం అంధకారంలోకి కూరుకుపోయింది. ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడిన ఒక తెలంగాణ ఉద్యమ కారునిగా ప్రాధేయపడుతూ 2017, 2020, 2022 లో మీరు ఇచ్చిన హామీ మేరకు నేను పొందాల్సిన వీఆర్వోకి సమానమైన జూనియర్ అసిస్టెంట్ స్కేల్ పదోన్నతి కల్పిస్తే ఏ ఇతర శాఖలోనైనా నీతి, నిజాయితీగా సేవలు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను' అంటూ వేడుకున్నాడు.