Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిమ్స్‌లో ఉద్యోగాల కోసం కాంట్రాక్టర్ నుంచి లంచం
- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
- మరో ఇద్దరు అధికారులూ..
నవతెలంగాణ-అదిలాబాద్టౌన్
నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాల్సిన జిల్లా ఉపాధి కల్పనశాఖ అధికారి లంచం డబ్బులకు కక్కుర్తిపడి అడ్డంగా దొరికిపోయారు. ఆయనతోపాటు ఆ శాఖ జూనియర్ ఎంప్లాయిమెంట్ అధికారి, రిమ్స్‌లో జూనియర్ అసిస్టెంట్ కూడా ఈ అవినీతిలో భాగస్వాములు కావడం చర్చనీయాంశమైంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఉపాధి కల్పన శాఖ కార్యాలయంలో మంగళవారం అధికారులు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధకశాఖ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం.. రిమ్స్ ఆస్పత్రిలో దుర్గం సొసైటీ ద్వారా 24మందికి పొరుగు సేవలు(పేషెంట్‌కేర్) ఉద్యోగాల కోసం క్లియరెన్సు(అలాట్మెంట్ కాపీ) కోసం సదరు కాంట్రాక్టర్ జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి కిరణ్ కుమార్‌ను సంప్రదించారు. అలాట్మెంట్ కాపీ ఇవ్వాలంటే రూ.3లక్షల వరకు ఇచ్చుకోవాలని సదరు అధికారి డిమాండ్ చేశారు. అంతగా ఇవ్వలేనని కాంట్రాక్టర్ ప్రాధేయప డగా రూ.2.25లక్షలకు ఒప్పందం కుదిరింది. దీంతో ఈనెల 25న కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. మంగళవా రం సదరు గుత్తేదారు ఆ డబ్బులను ఎంప్లాయిమెంట్ కార్యాలయానికి తీసుకెళ్లి రిమ్స్ జూనియర్ అసిస్టెంట్ తేజకు అందించగా.. ఈయన ఉపాధి కల్పనశాఖ జూనియర్ ఎంప్లాయిమెంట్ అధికారి విజయలక్ష్మీకి అందించారు. ఆమె ఆ శాఖ ఉన్నతాధికారి కిరణ్‌కు సంబంధించిన డెస్కులో పెట్టారు. అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు కార్యాలయానికి వెళ్లి పట్టుకున్నారు. అయితే, ఫిర్యాదు ప్రకారం కిరణ్‌కుమార్‌ను పట్టుకోగా, విజయలక్ష్మి, తేజ ప్రమేయం కూడా బయటపడింది. ముగ్గురి వేలిముద్రలను కెమికల్ టెస్ట్ చేయగా.. పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఏ1 కిరణ్, ఏ2 తేజ, ఏ3 విజయలక్ష్మీపై కేసు నమోదు చేసి కరీంనగర్‌లోని ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరు పర్చనున్నట్టు డీఎస్పీ తెలిపారు.