Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్రెడ్డి
- చట్ట సభల పని దినాలు తగ్గిపోవటం ఆందోళనకరం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్కు వామపక్షాల పొత్తు కలిసొస్తుందని శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్రెడ్డి అభిప్రాయపడ్డారు. తద్వారా తమ పార్టీకి ఎక్కువ స్థానాలొస్తాయంటూ ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్లోని శాసన మండలి ప్రాంగణంలో గుత్తా మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈనెల 14 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగే అవకాశముందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య వివాదం సర్దుకుంటుందంటూ తాను ముందే చెప్పానని వ్యాఖ్యానించారు. తమిళనాడు తరహా సంఘటనలు ఇక్కడ జరగబోవని భావిస్తున్నానని అన్నారు. అక్కడి గవర్నర్ ప్రసంగం మాదిరిగా ఇక్కడి గవర్నర్ ప్రసంగం ఉండబోదని అభిప్రాయపడ్డారు. అయితే అన్ని రాష్ట్రాల్లోని గవర్నర్లు కేంద్రం చెప్పినట్టే వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గవర్నర్ ప్రసంగం సాఫీగా సాగాలని ఆకాంక్షించారు. గవర్నర్తో విబేధాలు వస్తాయి.. పోతాయని అన్నారు. దేశవ్యాప్తంగా చట్టసభలు నడిచే సమయం తగ్గిపోవటం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాదికి 60 రోజులపాటు సభలు నడవాలనే అంశంపై గతంలో పెద్ద చర్చే కొనసాగిందని గుత్తా ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొన్ని రాష్ట్రాల్లో రాజకీయ శూన్యత ఉందనీ, అందువల్ల బీఆర్ఎస్కు జాతీయ స్థాయిలో ఆదరణ కచ్చితంగా దక్కుతుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. తన కుమారుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారనీ, అయితే పోటీ చేయాలా..? వద్దా..? అనేది పార్టీ నిర్ణయం ప్రకారమే ఉంటుందని చెప్పారు.