Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న డైలీవేజ్, ఔట్సోర్సింగ్ కార్మికుల 39 నెలల పెండింగ్ వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్, తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్ డైలీవేజ్, ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టేకం ప్రభాకర్, బి.మధు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఈ నెల రెండో తేదీన హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ మేరకు వారు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. శాసనసభ సమావేశాల్లో తమ సమస్యలను ప్రస్తావించాలనీ, తమ డిమాండ్ల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డికి వినతిపత్రం అందజేశామని తెలిపారు. హాస్టల్ వర్కర్ల వేతనాల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల రెండో తేదీన ఎస్వీకేలో తాను నిరాహారదీక్షకు దిగుతానని నర్సిరెడ్డి ప్రకటించారని పేర్కొన్నారు. ఈ నిరాహార దీక్షలో ఔట్సోర్సింగ్, డైలీవేజ్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాలకు సంబంధించి రూ. 9.15 కోట్ల విలువైన చెక్కు జనవరి నాలుగో తేదీ నుంచి పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. వేతనాల్లేక కార్మికులు అల్లాడుతుంటే చెల్లింపులపై సర్కారు ఆంక్షలు విధించడం అన్యాయమని తెలిపారు. డైలీవేజ్ కార్మికుల వేతనాల నిమిత్తం రూ.38 కోట్ల అవసరం కాగా కేవలం రూ.13 కోట్ల 65 లక్షలు జనవరి 14న విడుదల చేసినప్పటికీ 020 పద్దు ద్వారా వేతనాల చెల్లింపులపై ఈ-కుబేర్ సిస్టమ్‌లో ఆర్థిక శాఖ ఫ్రీజింగ్ విధించిందని వాపోయారు. తక్షణమే ఫ్రీజింగ్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రతినెలా ఒకటో తేదీనే వేతనాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.