Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిటైర్డ్ ఇంజినీర్స్ అసోసియేషన్ డిమాండ్
- రజత్‌కుమార్‌కు వినతి
నవతెలంగాణ-హైదరాబాద్
తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులను కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురావాలంటూ 2021లో ఇచ్చిన గెజిట్‌ను వెంటనే రద్దుచేయించాలని తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈమేరకు ఆ సంఘం అధ్యక్షులు ఇంజినీర్ ఎం. శ్యామ్‌ప్రసాద్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఇంజినీర్ టి. వెంకటశం మంగళవారం రాష్ట్ర సాగునీటి, ఆయకట్టు అభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ రజత్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, గెజిట్, పునర్విభజన చట్టం తదితర అంశాలకు సంబంధించి సవివర వినతిపత్రం సమర్పించారు. గెజిట్ మూలంగా పునర్విభజన చట్టం ఉల్లంఘనకు గురవుతున్నదని గుర్తు చేశారు. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ స్పందించి కేంద్రం నుంచి అమెండ్మెంట్ను తెచ్చుకుందని చెప్పారు.రాష్ట్రం నుంచి వెంటనే స్పందించాలని రజత్‌కుమార్‌ను కోరారు. గెజిట్‌లో పేర్కొన్న అంశాలన్నీ తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు కేంద్రం ఆలస్యంగా అనుమతులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. ఏపీ అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని విమర్శించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గెజిట్‌ను రద్దుచేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. సుప్రీంకోర్టులో ఉన్న కేసును ఉపసంహరించుకోవడం కూడా తెలంగాణకు నష్టం చేసిందన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశాలు పెట్టి సాగునీటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.