Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్కసారిగా కూలిన 6 అంతస్తులు
- 60 శాతం భవనం నేలమట్టం
నవతెలంగాణ-సిటీబ్యూరో
సికింద్రాబాద్ రాంగోపాల్పేటలో ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన డెక్కన్ మాల్ భవనం ఆరు అంతస్తులు ఒక్కసారిగా కూలిపోయాయి. అధికారులు కొన్ని రోజులుగా భారీ భద్రత నడుమ భవనం కూల్చివేత పనులు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, మంగళవారం పనులు జరుగుతున్న క్రమంలో ఆరు అంతస్తుల భవనం ఒక్కసారిగా 60 శాతం కుప్పకూలింది. చుట్టుపక్కల ఇండ్ల వారిని ముందే అధికారులు ఖాళీ చేయించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ నెల 19న ఆరు అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం జరిగి ముగ్గురు గల్లంతైన సంగతి తెలిసిందే. ఇందులో ఒకరి ఆచూకీ మాత్రమే లభ్యం కాగా మరో ఇద్దరి అచూకీ ఇంత వరకు తెలియరాలేదు. ఈ భవనం మంటల్లో కాలిపోవడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరింది. దాంతో మాలిక్ ట్రేడింగ్ అండ్ డిమాలిషన్ అనే సంస్థకు అధికారులు కూల్చివేత కాంట్రాక్టు పనులు అప్పగించారు. 26వ తేదీ నుంచి కూల్చివేత పనులను ప్రారంభించారు. మంగళవారం మధ్యాహ్నం తర్వాత వెనుక వైపు మిగిలి ఉన్న భాగంలో పిల్లర్లను కూల్చారు. ఈ క్రమంలో ఆరు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దాంతో పెద్దఎత్తున ధుమ్ము, దూళి ఆ ప్రాంతంలో కమ్ముకుంది. ముందు జాగ్రత్త చర్యలుగా పక్కనే ఉన్న కాబిబోలి బస్తీతో పాటు కొన్ని అపార్ట్మెంట్ల వాసులను అధికారులు అక్కడి నుంచి తరలించారు. అయితే ఎల్ ఆకారంలో ఉన్న ఈ భవనం ప్రధాన రహదారి నుంచి వెనుక వైపు వరకు మొత్తం కూల్చివేయగా, భవనానికి కుడి వైపున ఉన్న భాగం మాత్రం అలాగే ఉంది. కూల్చివేత పనులు మూడు రోజుల్లో పూర్తి చేస్తామని మాలిక్ ట్రేడింగ్, డిమాలిషన్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.