Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో ఆర్టీసీకి రెండుశాతం నిధులు కేటాయించాలని టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. జేఏసీ సమావేశం మంగళవారంనాడిక్కడి ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీసులో చైర్మెన్ కే రాజిరెడ్డి అధ్యక్షతన జరిగింది. కన్వీనర్ వీఎస్ రావు, కో కన్వీనర్ కత్తుల యాదయ్య, బీ జక్రయ్య, పీ రవీందర్‌రెడ్డి, ఎన్ బుద్ధవిశాల్, కే గంగాధర్ హాజరయ్యారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. రెండు వేతన సవరణల అమలు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాసిన ప్రభుత్వం అవి పూర్తయ్యి 70 రోజులు గడిచినా పట్టించుకోకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఆర్టీసీలో వెల్ఫేర్ కమిటీలను రద్దు చేసి, యూనియన్లను అనుమతించి, తక్షణం గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సీసీఎస్, పీఎఫ్, ఎస్బీఎస్ బకాయిలు చెల్లించాలనీ, కార్మికులపై పనిభారాలు తగ్గించి, వేధింపులు నిరోధించాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారానికి ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్ చొరవ తీసుకోవాలనీ, మంత్రులు కేటీఆర్, టీ హారీశ్‌రావు, పువ్వాడ అజరుకుమార్లతో కలిసి, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని కోరారు.