Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర వ్యాప్తంగా 22 సెంటర్లలో భూ పోరాటం
- ఫిబ్రవరి 9న ఇందిరాపార్కు వద్ద ధర్నా: ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
నవతెలంగాణ - అమరచింత
ఇండ్లు, ఇండ్ల స్థలాలు దక్కే వరకు ఈ పోరాటం ఆపే ప్రసక్తే లేదని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలోని దుంపాయికుంటలో కొనసాగుతున్న భూపోరాటం మంగళవారానికి 135 రోజులకు చేరుకున్నది. మల్లు లకిë గుడిసెవాసులకు మద్దతు తెలిపి మాట్లాడారు. అమరచింత మండల కేంద్రంలో పోరాట స్ఫూర్తితోనే పేదలు ఇక్కడ గుడిసెలు వేసుకొని పోరాటానికి దిగారని చెప్పారు. పోరాడితేనే ఏదైనా సాధించుకోవచ్చు అనే పట్టుదలతో గుడిసెలు వేసుకున్నారన్నారు. ఈ పట్టుదల.. పోరాటం సమస్య పరిష్కారం అయ్యే వరకు.. మన ఇండ్లు మనకు దక్కే వరకు ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గతంలో ఎర్రజెండా నీడలో చాలాచోట్ల సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పేదలు పోరాడి.. ఇండ్ల స్థలాలు సాధించుకున్నారని గుర్తుచేశారు. స్థలం ఉన్న ప్రతి ఒక్కరికీ ఇండ్లు నిర్మించుకోవడానికి రూ.5లక్షలు ఇస్తామని ఎన్నికలప్పుడు చెప్పి.. ఇప్పుడేమో మూడు లక్షల్లే ఇస్తామనడం సరైంది కాదన్నారు. స్థలం ఉన్న ప్రతి ఒక్కరికీ రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో పెట్టాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగానే ఫిబ్రవరి 3న మండల కేంద్రాల్లో తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా చేసి వినతిపత్రాలు ఇవ్వనున్నట్టు చెప్పారు. అయినా ప్రభుత్వం స్పందించకుంటే 9న ఇందిరాపార్కు వద్ద ధర్నా చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు అరుణ జ్యోతి, జిల్లా కార్యదర్శి లక్ష్మి, నాయకులు సాయి లీల, ఆకాశ వేణి, అనంతమ్మ, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జిఎస్ గోపి పాల్గొన్నారు.