Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రాచలం మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబురావు
నవతెలంగాణ - గోవిందరావుపేట / ఏటూర్‌నాగారం
ప్రభుత్వ భూమిలో పేదలు వేసుకున్న గుడిసెల స్థలాలకు పట్టాలు ఇచ్చి పక్కా గహాలు నిర్మించివ్వాలని భద్రాచలం మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబురావు అన్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని పస్రా గ్రామంలో సర్వే నెంబర్-109లో నిరుపేదలు వేసుకున్న గుడిసెలను మంగళవారం బాబురావు సందర్శించి వారితో మాట్లాడారు. ఏజెన్సీ ఏరియాలో గిరిజనులు, ఇతర పేదలు గూడు కోసం గుడిసెలు వేసుకుంటే భూమి వారికే చెందుతుందని చెప్పారు. దొంగ కాగితాలతో, అక్రమ పట్టాలతో భూస్వాములు భూమి మీదకు వస్తే పేదలు ఐక్యంగా తరిమి కొట్టాలని సూచించారు. 5వ షెడ్యూల్ ప్రకారం 1956 నుంచి ప్రభుత్వ భూమిగా ఉన్న 109 సర్వే నంబర్లో పవర్ ఆఫ్ పట్టా చెల్లదని, పుల్యాల కృష్ణారెడ్డ్డి ఏనాడూ కాస్తులో లేడని అన్నారు. ఈ భూమిపై 25 ఏండ్లుగా సీపీఐ(ఎం) పోరాటాలు నిర్వహిస్తోందని చెప్పారు. పార్టీ, గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో 18 ఏండ్లు అంగడి నిర్వహించిందన్నారు. రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై కృష్ణారెడ్డి అక్రమ పట్టా పొందాడని, పట్టా ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2022 జూన్‌లో ఐటీడీఏ పీఓ ఇచ్చిన తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు. పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వాలని, వారికి అక్కడే పక్కా ఇండ్లు ప్రభుత్వం నిర్మించివ్వాలని కోరారు. వాస్తవంగా ఈ భూమి 1956 నుంచి ప్రభుత్వ భూమిగా ఉందని చెప్పారు. అనంతరం సర్వే నంబర్ 109లోని ప్రభుత్వ స్థలంలో ఎస్టీ పేదలు 500 మంది, ఇతరులు గుడిసెలు వేసుకున్నారని, వారికి పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని కోరుతూ ఐటీడీఏ పీఓ అంకిత్‌కు వినతిపత్రం అందజేశారు. పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను, భూమి యదార్థ పరిస్థితిని పీఓకు వివరించారు. 109సర్వే నెంబర్లోని 10 ఎకరాలు 1985 నుంచి 2006 వరకు గ్రామపంచాయతీ ఆధీనంలో ఉందన్నారు. దీనిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్న భూస్వాములపై, అక్రమ పట్టాలు ఇచ్చిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి, నాయకులు పోదిల్లా చిట్టిబాబు, ఎండి దావూద్, జిమ్మ జ్యోతి, పాయం శారద, చాప పద్మ, జడ్జరి కృష్ణవేణి, తీగల ఆదిరెడ్డి, పొదిల్ల చిట్టిబాబు, అంబాల పోశాలు, మురళి, పాయం శారద, సరిత పల్లపు, రాజు, జిట్టెబోయిన రమేష్, సొహెల్, రాంబాబు తదితరులు ఉన్నారు.