Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలకు నిజానిజాలు తెలపాలి : తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అదానీ గ్రూప్ దొడ్డిదారిన నిధులను తరలిస్తున్నదనీ, మూల ధనాన్ని ఎక్కువ చేసి చూపించిం దంటూ అమెరికాకు చెందిన పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్ గుట్టురట్టు చేశారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. దిక్కు తోచని అదానీ జాతీయవాదం పేరుతో తన డొల్లతనాన్ని కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడని మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఈ సంస్థ మోడీ కనుసన్నల్లో ఉండడం వల్ల కార్పొరేట్ వ్యవహారాలు చూసే ఈడీ, సెబీ, ఆర్బీఐ నిమ్మకుండడంతో అదానీ దోపిడీకి అంతులేకుండా పోయిందని పేర్కొన్నారు. ఈ పరిశోధన సంస్థ ఆరోపణలపై నిజానిజాలు తేల్చడానికి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో, సంబంధిత మంత్రిత్వ శాఖలన్నింటినీ కలుపుకుని ఒక ఉన్నతస్థాయి బృందాన్ని ఏర్పాటు చేసి అదాని గ్రూపు ఆస్తుల లావాదేవీలపై విచారణను పారదర్శకంగా జరిపిం చాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను గౌతమ్ అదానీ గ్రూపు నకు అప్పనంగా అప్పజెప్పడం తో గత తొమ్మిదేండ్లుగా విపరీతంగా ఆస్తులను పోగేసుకుందని పేర్కొన్నారు. మరో పక్క ఆశ్రిత పెట్టుబడులను రాబడు తూ, తమ ఆధ్వర్యంలోని విదేశీ డొల్ల కంపెనీలకు నిధులు తరలించారని తెలిపారు. షేర్ల విలువ పెంచి దాని ఆధారంగా ప్రభుత్వ బ్యాంకులు, ఎల్ఐసీ నిధులను పెట్టుబడి పెట్టిం దని వివరించారు. 1000 శాతానికి పైగా షేర్ల విలువలు ఫ్యాబ్రికేట్ చేసి దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రభుత్వ సంస్థలకు, బ్యాంకులకు నష్టం కలుగ జేసిందని విమర్శించారు. ఇప్పటికే 40 శాతం భారత ఆర్థిక వ్యవస్థ ఒక్క శాతంగా ఉన్న సంపన్నుల చేతిలో ఉందని తెలిపారు. దీనిపై నియంత్రణ లేకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లి ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అదానీ గ్రూపు వ్యవహా రమంతటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలనీ, ఆ గ్రూపు డొల్లతనాన్ని బయటపెట్టి ఇలాంటి ఆర్థిక దోపిడీ పద్ధతులను అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు.