Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'మన ఊరు-మనబడి' పనులు పూర్తి
- నేడు గంభీరావుపేటలో మంత్రులు కేటీఆర్, సబిత చేతుల మీదుగా ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సర్కారు బడుల్లో 'మన ఊరు-మన బడి' పథకం కింద సకల సౌకర్యాలు కల్పించనున్నట్టు సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.7,289 కోట్లతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 12 రకాల మౌలిక వసతులను సమకూర్చాయని పేర్కొన్నారు. మన ఊరు-మనబడి పథకంలో భాగంగా మొదటి విడతలో పనులు పూర్తయిన పాఠశాలలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. బుధవారం సిరిసిల్ల నియోజకవర్గంలోని గంభీరావుపేటలో పాఠశాలను మంత్రులు కేటీ రామారావు, పి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభిస్తారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సకల వసతులు కల్పించేందుకే ఈ పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు. పాఠశాలల్లో భవనాలకు మరమ్మతులు చేపట్టడం, రంగులు వేయడం, కాంపౌండ్ వాల్స్ నిర్మించడం, విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం ఫర్నీచర్ అమర్చడం, డిజిటల్ తరగతులు, సోలార్ ప్యానళ్లు, అధునాతన వసతుల పాఠశాలలుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నదని తెలిపారు. బడి పిల్లల భవితకు బంగారు బాటలు నిర్మించేందుకు విద్యా శాఖ చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించాలంటూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు, విద్యాశాఖ ఉన్నతాధికారులకు మార్గనిర్దేశనం చేశారని వివరించారు. 'మన ఊరు-మన బడి' పథకం కింద పాఠశాలల్లో పరిశుభ్రమైన తాగునీరు, టాయిలెట్ల నిర్మాణం, అదనపు తరగతి గదులు, మంచి లైటింగ్ సదుపాయం, భోజన వసతి ఏర్పాట్లు, గ్రీన్ బోర్డులు, డిజిటల్ తరగతులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలనీ, పనులు సత్వరం పూర్తి చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు. విద్యారంగం బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు. విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సర్కారు స్కూళ్లను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని వివరించారు. జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఎప్పటికప్పడు రోజు వారీ సమీక్షలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. పనులు పూర్తయిన పాఠశాలలను స్థానిక ప్రజా ప్రతినిధులు బుధవారం నుంచి ప్రారంభోత్సవాలు చేస్తారని వివరించారు.