Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్‌లోని ఇందిరాపార్కుకు తరలిరండి : వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో జాగాలేని పేదలందరికీ స్థలాలిచ్చి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టుకోవడానికి వీలుగా రూ.5 లక్షల ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వాన్ని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న పేదలందరికీ ఇండ్ల పట్టాలివ్వాలనీ, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని కోరారు. ఇవే డిమాండ్లపై ఈ నెల 9న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్టు ప్రకటించారు. పేదలంతా ఈ ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లోని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాగయ్య మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు ఉండేందుకు సొంత జాగాలు లేక ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసు కుని నివసిస్తున్నారని తెలిపారు. వేలాది మంది నిరు పేదలు తాగడానికి నీళ్లు, కనీససౌకర్యాలు, కరెంటు లేకపోయినా డేరాల్లోనే కాపురాలు చేస్తున్న ధైన్యస్థితిని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి గుడిసెలు వేసుకున్న చోటనే 125 గజాల ఇంటి జాగాకు పట్టాలివ్వాలనీ, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు అధికారులు తాళాలేశారనీ, అవి నేడు అసాంఘిక శక్తులకు, పందికొక్కులకు నిలయాలుగా మారాయని విమర్శించారు. పోడు సాగదారులను గుర్తించడానికి చేసిన సర్వే ఆధారంగా సాగుదారులకు హక్కు పట్టాలివ్వడంతో పాటు రైతుబంధు, రైతు బీమాను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. గ్రామ సభ తీర్మానం, ఫిజికల్ సర్వే ఆధారంగా లబ్దిదారులను గుర్తించి హక్కు పట్టాలిచ్చేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రభు త్వాన్ని కోరారు. అభివృద్ధి కోసం భూమిని సేకరణ ప్రాంతాల్లో 2013 సేకరణ చట్ట ప్రకారం ఇస్తున్న పునరావాస ప్యాకేజీని వ్యవసాయ కార్మికులకు, వృత్తిదారులకు కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పేదలు సాగు చేసుకుంటున్న పట్టాలేని భూములకు కూడా మార్కెట్ విలువ కంటే నాలుగు రెట్ల అధిక పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 57 ఏండ్లు పైబడ్డ వారందరికీ నెలకు రూ.5 వేల పింఛన్ ఇవ్వాలని కోరారు. తెల్ల రేషన్‌కార్డు కోసం నిరంతరం మీ సేవలో దరఖాస్తులు పెట్టుకునే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ధరణిలో అసైన్మెంట్, బంజరు, ఇనాం భూములకు పట్టాలు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి. ప్రసాద్, నారి ఐలయ్య, కొండమడుగు నరసింహ, పొన్నం వెంకటేశ్వరరావు, మహిళా కన్వీనింగ్ కమిటీ కన్వీనర్ బి.పద్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శులు పెద్ది వెంకట్రాములు, నరసింహులు, వెంకటయ్య, గోపాల్, ములకలపల్లి రాములు, కందుకూరి జగన్, సమ్మయ్య, అల్వాల వీరన్న, ఎదునూరి వెంకట్ రాజాం, తదితరులు పాల్గొన్నారు.