Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వరంగంలోనే విద్యావైద్యం ఉండాలి
- రాజకీయ ప్రయోజనాల ఆధారంగానే బడ్జెట్ కేటాయింపులు
- ప్రాజెక్టులు, డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించాలి
- సొంత జాగా ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.8 లక్షలివ్వాలి
- కౌలు రైతులకూ రైతుబంధు వర్తింపచేయాలి
- గురుకులాలతో అందరికీ నాణ్యమైన విద్య అందదు
- చట్టసభల పనిదినాలు కుదించడం సబబు కాదు
- ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయకుంటే ప్రత్యక్ష కార్యాచరణ
- నవతెలంగాణతో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
ఆపద వచ్చినపుడు ప్రయివేటు సంస్థలు ప్రజలను ఆదుకోబోవని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి చెప్పారు. విద్యావైద్యం ప్రభుత్వ రంగంలోనే ఉండాలని డిమాండ్ చేశారు. అప్పుడే అందరికీ నాణ్యమైన, సమానమైన విద్యతోపాటు వైద్య సేవలు అందుతాయని చెప్పారు. రానున్న బడ్జెట్లో విద్యావైద్య రంగానికి అధిక ప్రాధాన్యత నివ్వాలని డిమాండ్ చేశారు. విద్యకు 24 శాతం, వైద్యరంగానికి 12 శాతం నిధులు కేటాయించాలని కోరారు. ఈనెల మూడో తేదీ నుంచి అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా నవతెలంగాణ ప్రతినిధి బొల్లె జగదీశ్వర్‌కు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు...
విద్యావైద్య రంగాలకు అధిక నిధులు కేటాయించాలంటూ సంతకాల సేకరణ చేస్తున్నారు. స్పందన ఎలా ఉంది...?
అధ్యాపకులు, విద్యార్థులు పెద్దఎత్తున స్వాగతం పలుకుతున్నారు. ఉత్సాహంగా పాల్గొని సంతకాలు చేస్తున్నారు. మంచి స్పందన వస్తున్నది. విద్యావైద్య రంగాలకు ప్రభుత్వం నామమాత్రంగా నిధులు కేటాయిస్తున్నది. నిధులు పెంచాలంటూ ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వరంగంలో విద్యావైద్యం ఉంటేనే అందరికీ నాణ్యమైన, సమానమైన వసతులు అందుతాయి. కరోనా లాక్డౌన్ సమయంలో ప్రయివేటు ఆస్పత్రులు మూతపడ్డాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రజలకు వైద్య సేవలందాయి. ఆశా వర్కర్ నుంచి సూపర్ స్పెషాలిటీ డాక్టర్ల వరకు ప్రాణాలకు తెగించి కరోనా కట్టడి కోసం కృషి చేశారు. ఈ సమయంలో ఏ ఒక్క కార్పొరేట్, ప్రయివేటు ఆస్పత్రి ప్రజలకు వైద్య సేవలు అందించలేదు. భరోసా కల్పించేందుకు ముందుకు రాలేదు. కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు అధిక బిల్లులు వేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేశాయి. చనిపోయిన వారి శవాలను కూడా డబ్బులు కట్టనిదే ఇవ్వలేదు. కరోనా సమయంలో ప్రయివేటు విద్యాసంస్థలు ఆన్లైన్ చదువుల పేరుతో పూర్తి ఫీజులు వసూలు చేశాయి. బస్సు ఛార్జీలను కూడా కట్టాలని కోరాయి. ఆపద వచ్చినపుడు ప్రయివేటు సంస్థలు ప్రజలను ఆదుకోవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచి విద్యావైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలంటూ కోరేందుకే తెలంగాణ పౌర స్పందన వేదిక (టీపీఎస్వీ)ను ఏర్పాటు చేశాం.
రాష్ట్ర ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్. ఇప్పటి వరకు కేటాయింపుల తీరుతెన్నులపై ఏమంటారు?
ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లు ప్రజల తాత్కాలిక అంశాలను తీర్చేందుకే ఉపయోగపడ్డాయి ఏ బడ్జెట్లోనైనా రాజకీయ ప్రయోజనం పొందాలనే లక్ష్యం కనిపించింది. సాగునీటి ప్రాజెక్టులకు అధిక నిధులు కేటాయించింది. దాని వల్ల కొంత ప్రయోజనం చేకూరింది. నీళ్లు వచ్చాయి. కానీ శ్రీశైలం సొరంగ మార్గం పనులు పూర్తి చేసి ఉంటే నల్లగొండ జిల్లాలో సాగునీరందించడానికి అవకాశముండేది. డిండి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయలేదు. ఇప్పటికైనా సమీక్షించి ఆ ప్రాజెక్టుల పనులను పూర్తి చేయాలి. రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించింది. అందులో 35 వేల ఇండ్లను పూర్తి చేసింది. ఇంకా 65 వేల ఇండ్లను పేదలకు పంపిణీ చేయాలి. నా నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లు కనిపిస్తున్నాయి. వాటిని పూర్తి చేసి అర్హులైన వారికి ఇవ్వాలి. సొంత జాగా ఉన్న వారి ఇంటి నిర్మాణం కోసం రూ.ఎనిమిది లక్షలు చెల్లించాలి. కౌలు రైతులకూ రైతుబంధు పథకాన్ని వర్తింపచేయాలి. సేద్యం చేయని భూమికి రైతుబంధు ఇవ్వడం సరైంది కాదు. కలెక్టర్ పిల్లలు, బంట్రోతు కొడుకు ఒకే బడిలో చదివే విధానం తీసుకొస్తామంటూ 2014, జులై 26న సీఎం కేసీఆర్ ప్రకటించారు. అప్పుడు సంతోషపడ్డాను. ఆచరణలో వచ్చేసరికి కులాలవారీగా గురుకులాలు ఏర్పాటు చేశారు. వాటిలో 4.50 లక్షల మందికే నాణ్యమైన విద్య అందుతున్నది. ఒకటి నుంచి పదో తరగతి వరకు 60 లక్షల మంది విద్యార్థులున్నారు. అందువల్ల ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, గిరిజన ఆశ్రమ పాఠశాలలను అభివృద్ధి చేయాలి. బడ్జెట్లో విద్యకు అధికంగా నిధులు కేటాయించాలి.
విద్యావైద్యం, ఉపాధి, మౌలిక వసతుల కల్పనకు నిధుల కేటాయింపు, వాటి ఖర్చు ఎలా ఉందంటారు?
విద్యావైద్య రంగాలకు కేటాయింపులు, ఖర్చుకు దగ్గరి సంబంధం ఉంటుంది. 90 శాతం వరకు ఖర్చవుతుంది. ఎందుకంటే ఆయా రంగాలకు కేటాయింపుల్లో ఎక్కువ శాతం జీతభత్యాలు, పెన్షన్లు ఇవ్వడానికే కేటాయిస్తారు. అందుకే బడ్జెట్లో విద్యకు 24 శాతం, వైద్యరంగానికి 12 శాతం నిధులు కేటాయించాలి. వైద్యరంగంలో పీహెచ్‌సీలను మెరుగుపర్చాలి. పట్టణీకరణ, నగరీకరణ పెరుగుతున్న నేపథ్యంలో యూపీహెచ్‌సీలను ఏర్పాటు చేయాలి. కానీ ప్రభుత్వం బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాలను అందుబాటులోకి తెస్తున్నది. అవి ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకే పనిచేస్తున్నాయి. ఇన్‌పేషెంట్ (ఐపీ)కి అవకాశం లేదు. పీహెచ్‌సీలు కూడా 24 గంటలు పనిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. జనభాకనుగుణంగా యూపీహెచ్‌సీలను పెంచాలి. బీసీ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్, మైనార్టీ సంక్షేమ సంస్థలకు బడ్జెట్ కేటాయింపులు ఉంటున్నాయి. కానీ నిధులు విడుదల కావడం లేదు. ఇది సరైన విధానం కాదు. సంక్షేమ పథకాలకు కేటాయించిన నిధులన్నీ ఖర్చు చేయాలి.
శాసనమండలి సమావేశాల తీరుతెన్నులు ఎలా ఉన్నాయి. సభ్యులు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానాలు చెప్తున్నదా?
సభా నిర్వహణ సమయం తగ్గుతున్నది. రోజులు కుదించబడుతున్నాయి. మొదటి దశలో ఏడాదికి 90 రోజులు సభ జరిగేదని రికార్డుల్లో ఉన్నది. పదేండ్ల కింద 50 నుంచి 60 రోజులు సభ జరిగేది. నేను ఎన్నికైన నాలుగేండ్ల నుంచి పనిదినాలు ఏడాదికి 15 నుంచి 20 రోజులే ఉంటున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో మూడు రోజులే సమావేశాలను నిర్వహించారు. ప్రజా సమస్యలను ప్రస్తావించే ప్రశ్నోత్తరాలు, ప్రత్యేక ప్రస్తావనలను తొలగించారు. సభ నిర్వహణ సమయం, పనిదినాలు పెరగాలి. సభ్యుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రజాసమస్యలను ప్రస్తావించే సమయాన్ని కేటాయించాలి. ప్రభుత్వానికి ఇబ్బంది లేకుంటే సంతృప్తికరమైన సమాధానం ఇస్తుంది. రాజకీయంగా ఇబ్బంది ఉంటే దాటవేత ధోరణిని అవలంభిస్తుంది. ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టినపుడు సభ్యులకు మాట్లాడే అవకాశాన్ని కల్పించడం లేదు. ఇది సరైంది కాదు.
ఆర్థిక సర్వే, కాగ్ నివేదికలు ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతున్నాయి. వాటిపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఎలా ఉందంటారు?
వాస్తవంగా కాగ్ నివేదిక, ఆర్థిక సర్వే, ఆడిట్ నివేదికలను టేబుల్ పేపర్లుగా మాకు అందిస్తారు. రెండేండ్ల క్రితం నుంచి వెచ్చించిన ఖర్చుల వివరాలు అందులో ఉంటాయి. తప్పనిసరి అయిన వాటిని మాత్రమే ఆడిట్ అభ్యంతరాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. మిగతా వాటిని దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నది.
ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. కానీ ఉపాధ్యాయ ఖాళీల భర్తీ గురించి ఎలాంటి ప్రకటన లేదు. దీనిపై ఏమంటారు?
ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని అనేక సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తెచ్చాను. నల్లగొండ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్రను చేపట్టాను. ఇప్పుడు బదిలీలు, పదోన్నతులు చేపడుతున్నందుకు సంతృప్తిగా ఉన్నది. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తికాగానే ఉపాధ్యాయ ఖాళీల వివరాలను తేల్చి నియామకాల కోసం ప్రకటన చేస్తారని భావిస్తున్నాం. ఆలస్యమయ్యే పరిస్థితి ఉంటే తప్పనిసరిగా ఉపాధ్యాయ నియామకాల కోసం ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకుంటాను. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగానే ఉపాధ్యాయుల నియామకం సరైంది కాదు. దాని వల్ల ప్రాథమిక పాఠశాలలు ఉనికిని కోల్పోయే ప్రమాదముంది. ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి ఒక గది, తరగతికి ఒక టీచర్ ఉండేలా నియామకాలు చేపట్టాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులను ప్రారంభించాలి.