Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుల ఆదాయం రెట్టింపు ఎలా సాధ్యం...?
- కేంద్రానికి తెలంగాణ రైతు సంఘం ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వ్యవసాయానికి బడ్జెట్లో కోతలు విధించి, రైతుల ఆదాయాన్ని ఎలా రెట్టింపు చేస్తారని తెలంగాణ రైతు సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈమేరకు బుధవారం ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్, టి సాగర్ ఒక ప్రకటన విడుదల చేశారు. 2023-24లో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి రూ.1,15,531.79 కోట్లు కేటాయించిందనీ, అందులో వ్యవసాయానికి రూ.71,378 కోట్లు మాత్రమే కేటాయించి,మిగిలిన నిధులు పథకాలకు వెచ్చించిందని పేర్కొన్నారు. అన్ని అనుమతులు పొందిన సాగునీటి వనరులకు కేంద్రం నుంచి అన్ని రాష్ట్రాలకు రూ.4వేలు కోట్లు ఇస్తుండగా, గతేడాది నుంచి దానిని తగ్గించిందని గుర్తు చేశారు. పరిశోధనలకు గతంలో రూ.8,513 కోట్లు ఇవ్వగా దానిని రూ.9వేల కోట్లకు పెంచినప్పటికీ పరిశోధనలకు మాత్రం రూ.8,941 కోట్లు మాత్రమే కేటాయించారని విమర్శించారు. పశు సంవర్ధక శాఖకు గతంలో రూ.4వేల కోట్లు కేటాయించగా, ప్రస్తుతం రూ.4,687 కోట్లమేర నామమాత్రంగా పెంచిందని తెలిపారు. వ్యవసాయ రంగానికి మొత్తం బడ్జెట్లో 3.2 శాతం మాత్రమే నిధులు కేటాయించారని పేర్కొన్నారు. ప్రకతి వైపరీత్యాల వల్ల పెద్ద ఎత్తున నష్టం జరుగుతున్నప్పటికీ కేంద్రం బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయలేదని విమర్శించారు. రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేయకపోవడం వల్ల బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడంలేదని పేర్కొన్నారు. మార్కెట్లలో కనీస మద్దతు ధరలు అమలు కావడం లేదని తెలిపారు. ఈ పరిస్థితుల దృష్ట్యా వ్యవసాయ బడ్జెట్ను పున:పరిశీలించాలని డిమాండ్ చేశారు. లేదంటే దేశశ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.