Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ భారతదేశంలో అసమానతలను మరింత పెంచేదిగా ఉన్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. రైతులు, పేదలను కొట్టి కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టేవిధంగా ఇది ఉందని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇది ప్రజావ్యతిరేకమనీ, అత్యంత చెత్త బడ్జెట్ అని విమర్శించారు. ఇందులో రాష్ట్రానికి మొండి చేయి చూపిందని పేర్కొన్నారు.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి గతేడాది రూ.93 వేల కోట్లు కేటాయిస్తే, ఇప్పుడు రూ.60 వేల కోట్లకు తగ్గించారని వివరించారు. దేశంలో ధనవంతుల సంపద అంతకంతకూ పెరుగుతున్నదనీ, పేదలు మరింత పేదలవుతున్నారని పేర్కొన్నారు. ధనవంతులపై 10 శాతం పన్ను విధిస్తే విద్యా, వైద్యం పేదలకు ఉచితంగా అందించొచ్చని సూచించారు. అలాంటి చర్యలు తీసుకోకుండా కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాసేలా కేంద్ర నిర్ణయాలున్నాయని విమర్శించారు. రాష్ట్రానికి సంబంధించి ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్శిటీల ఊసేలేదని తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన బకాయి లకు సంబంధించి ఈ బడ్జెట్లో పొందుపరచలేదని పేర్కొన్నారు. జీఎస్టీతోపాటు మరోసారి సెస్‌ల పేరుతో దోపిడీ చేస్తున్నదని విమర్శించారు. జీఎస్టీలో రాష్ట్రాలకు వాటాల పెంపుదలకు సంబంధించిన ప్రస్తావన లేదని తెలిపారు.
పటాటోప బడ్జెట్ : ప్రజాపంథా
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరుద్యోగులను, రైతులను, మధ్యతరగతి ప్రజలను నిరాశపర్చిందని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు విమర్శించారు. కార్పొరేట్ వర్గాలను సంతృప్తిపరిచేలా ఉందని ఒక ప్రకటనలో తెలిపారు. అది మాయామశ్చీంద్ర, మెరుపుల, పటాటోప, మేడిపండు బడ్జెట్ అని ఎద్దేవా చేశారు. బీజేపీ మార్క్ స్వదేశీ ముసుగు, కార్పొరేట్ బడ్జెట్ అని విమర్శించారు.