Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇందులో ఇతర రాష్ట్రాలవారు 160 మంది పైనే..!
నవతెలంగాణ - ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో నెల పాటు నిర్వహించిన 'ఆపరేషన్ స్మైల్' లో పోలీసులు 2814 మంది పిల్లల్ని రక్షించారు. వీరిలో అనాథ పిల్లలతో పాటు తప్పిపోయినవారు, ఇంటి నుంచి పారిపోయి వచ్చిన వారు, హ్యూమన్ ట్రాఫికర్స్కు చిక్కినవారు ఉన్నారని 'ఆపరేషన్ స్మైల్'ను పర్యవేక్షించిన రాష్ట్ర మహిళా, భద్రతా విభాగం అదనపు డీజీ షికా గోయెల్ బుధవారం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 'ఆపరేషన్ స్మైల్'కు చెందిన 715 మంది అధికారులు, సిబ్బంది ఈ ఫలితాలను సాధించారని చెప్పారు. రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు, ఇటుక బట్టీలు, కార్ఖానాలు, హోటళ్లు, పసి వాళ్లతో బలవంతంగా పని చేయిస్తున్న ఇతర కార్ఖానాల నుంచి ఈ పిల్లలను రక్షించటం జరిగిందని ఆమె తెలిపారు. రక్షించబడ్డ పిల్లల్లో 300 మందికి పైగా బాలికలు ఉన్నారనీ, అలాగే 160 మందికి పైగా ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలు ఉన్నారని చెప్పారు. పిల్లలతో బలవంతంగా పని చేయిస్తున్న 406 మందిని అరెస్టు చేయడం జరిగిందని షికా గోయెల్ వివరించారు. దాదాపు ఆరు నెలల నుంచి కనిపించకుండా పోయిన ముగ్గురు పిల్లలను కూడా రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించటం జరిగిందని తెలిపారు. రక్షించబడిన పిల్లల్లో చాలా మందిని తమ తల్లిదండ్రుల వద్దకు చేర్చడం జరిగిందని, మిగతావారిని బాలల హోమ్‌లలో ఉంచటం జరిగిందని ఆమె చెప్పారు. ఈ ఆపరేషన్‌లో పోలీసులతో పాటు శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ తో పాటు పలు ఎన్జీవో సంస్థలకు చెందిన కార్యకర్తలూ పాల్గొన్నారని తెలిపారు. వచ్చే జూన్ నెలలో మరోసారి రాష్ట్రంలో 'ఆపరేషన్ ముస్కాన్'ను నిర్వహించనున్నట్టు షికా గోయెల్ ప్రకటించారు.