Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధికి ఉరేశారు : వ్యకాస
- నేడు బడ్జెట్ పత్రాల దహనం :కేవీపీఎస్
- అభివృద్ధికి దోహదపడని బడ్జెట్ :టీజీఎస్
- యువతను విస్మరించిన బడ్జెట్ :డీవైఎఫ్ఐ
- విద్యారంగంపై తీవ్ర నిర్లక్ష్యం :ఎస్ఎఫ్ఐ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రజా సంఘాలు పెదవి విరిచాయి. ఆయా రంగాలకు తగినట్టుగా కేటాయింపులు తగినట్టు లేవంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి.. ఈ మేరకు ఆయా సంఘాల నేతలు బుధవారం వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. వివిధ రూపాల్లో నిరసనలకు పిలుపునిచ్చారు.
కేంద్ర బడ్జెట్ ఉపాధికి ఉరేసిందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.నాగయ్య, ఆర్.వెంకట్ రాములు విమర్శించారు. ఆహార సబ్సిడీ, రైతులకిచ్చే ఇన్‌ఫుట్ సబ్సిడీపై భారీ ఎత్తున కోతలు విధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ఉపాధికి గతేడాది కన్నా 40 శాతానికి పైగా నిధులు తగ్గించారని తెలిపారు. సంక్షేమ పథకాలను ఎత్తివేస్తూ, ఉపాధి నిధుల తగ్గించినందుకు నిరసనగా గురువారం కేంద్ర బడ్జెట్ పత్రాల దహనం కార్యక్రమాన్ని నిర్వహించాలని కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జాన్ వెస్లీ, టి.స్కైలాబ్ బాబు పిలుపునిచ్చారు. జనాభాలో 20 శాతమున్న దళితులకు 16 శాతం నిధులనే కేటాయించారని వారు విమర్శించారు. గతేడాది ఉపాధి హామీ చట్టానికి రూ.89,400 కేటాయించి ఈ ఏడాది రూ.60,000 కోట్లకు తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ తర్వాత వలస వెళ్లిన పేదలు దాదాపు 19 కోట్ల మంది గ్రామాల్లో రెక్కల కష్టమే జీవనాధారంగా బతుకుతుంటే ఉపాధి హామీకి నిధులెట్లా తగ్గిస్తారని ప్రశ్నించారు.
కేంద్ర బడ్జెట్ గిరిజనులను అంకెలగారడీతో మోసం చేసే విధంగా ఉందని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం. ధర్మ నాయక్ ,ఆర్ శ్రీరాం నాయక్ లు విమర్శించారు. రూ.45 లక్షల కోట్ల బడ్జెట్లో వారికి కేటాయించింది నామమాత్రమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్ర బడ్జెట్లో గిరిజన సబ్ ప్లాన్ స్ఫూర్తికి విరుద్ధంగా నిధులను కేటాయించడంతోపాటు పూర్తిగా నీరుగార్చే విధంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో సగం జనాభా కలిగిన ఓబీసీల సంక్షేమాన్ని కేంద్ర బడ్జెట్ విస్మరించిందని తెలంగాణ రజక వత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పైళ్ల ఆశయ్య తీవ్రంగా విమర్శించారు. పన్నుల రూపంలో లక్షల కోట్ల రూపాయలను చెల్లిస్తున్నా వారికి న్యాయం చేయడంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ విఫలమైందని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్లో విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేశారని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.ఎల్.మూర్తి, టి.నాగరాజు, యువతను విస్మరించారని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేశ్, ఆనగంటి వెంకటేష్ విమర్శించారు. వికలాంగుల పట్ల కేంద్రం ప్రదర్శించిన నిర్లక్ష్యానికి నిరసనగా బడ్జెట్ పత్రాలను దహనం చేసే కార్యక్రమానికి ఎన్పీఆర్డీ రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకట్, కార్యదర్శి ఏం.అడివయ్య పిలుపునిచ్చారు.