Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
బొగ్గు రవాణాలో సింగరేణి కాలరీస్ రికార్డు నెలకొల్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది జనవరి నెలలో 68.4 లక్షల టన్నుల బొగ్గు రవాణాను సాధించింది. అలాగే 16.67 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ వెలికితీశారు. 2016 మార్చి నెలలో చేసిన 64.7 లక్షల టన్నుల బొగ్గు రవాణాయే ఇప్పటి వరకు గరిష్ట రికార్డుగా నమోదై ఉంది. దాన్ని జనవరి నెలలో అధిగమించారు. రోజుకు సగటున 39 రైలు బండ్ల చొప్పున మొత్తం 1216 రేకుల ద్వారా బొగ్గు రవాణా జరిపినట్టు ఆ సంస్థ సీఎమ్‌డీ ఎన్ శ్రీధర్ తెలిపారు. తెలంగాణ జెన్కోతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఎక్కువ శాతం బొగ్గును రవాణా చేసినట్టు వివరించారు. అలాగే ఓపెన్ కాస్టు గనుల్లో ఓవర్ బర్డెన్ (ఓబీ) తొలగింపులో కూడా కొత్త రికార్డు నెలకొల్పినట్టు తెలిపారు. తొలిసారిగా మంగళవారం (జనవరి 31వ తేదీ) ఉదయం షిఫ్టు మొదలుకొని రాత్రి షిఫ్టు వరకు అత్యధికంగా 16.67 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ను తొలగించినట్టు వివరించారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న 18 ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి చేయాలంటే దానిపై ఉన్న మట్టిని (ఓవర్ బర్డెన్) తొలగించాల్సి ఉంటుంది. ఇందుకోసం కంపెనీ యంత్రాలతోపాటు ఆఫ్ లోడింగ్ యంత్రాల సహాయంతో ఓబీని తొలగిస్తుంటారు. మంగళవారం ఆఫ్ లోడింగ్ ద్వారా 14.83 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ను, డిపార్ట్మెంట్ యంత్రాల సహాయంతో 1.84 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీని తొలగించి కొత్త రికార్డు నెలకొల్పినట్టు చెప్పారు. ఈ సందర్భంగా సీఎమ్‌డీ శ్రీధర్ కార్మికులను అభినందించారు.