Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండమెలిగే పండుగతో ప్రారంభం
- అమ్మవార్ల గద్దెలను శుద్ధి చేసి, ప్రత్యేక పూజలు
- పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ-తాడ్వాయి
మేడారంలో బుధవారం మినీ వనజాతర మొదలైంది. రెండేండ్లకు ఓసారి జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర.. మధ్యలో మినీ జాతర పేరిట ఈ ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 1న మండమెలిగే పండుగతో మినీ జాతర మొదలైంది. మేడారం, కన్నెపల్లిలో పూజారులు మండమెలిగే పండుగ నిర్వహించారు. సమ్మక్క పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో ప్రధాన పూజారి మునీందర్ ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరో పూజారి సిద్ధబోయిన లక్ష్మణరావు ఇంట్లో మామిడి తోరణాలు కట్టి డోలు వాయిద్యాలతో సమ్మక్క గుడి వద్దకు చేరుకున్నారు. గ్రామదేవతలకు పూజలు చేశారు. అనంతరం గద్దెల వద్ద గజ స్తంభాలను ఏర్పాటుచేసి మామిడాకు తోరణాలు కట్టారు. గురు, శుక్ర వారాల్లో సారలమ్మ, సమ్మక్క గద్దెలను శుద్ధి చేసి పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సందర్శకులు పెరిగే అవకాశం ఉండటంతో అందుకనుగుణంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మూడ్రోజులపాటు ఈ మినీ జాతరలో అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురామని, గద్దెలపై ప్రత్యేక పూజలు మాత్రమే చేస్తామని పూజారులు చెప్పారు.
ఘనంగా చెలపెయ్య ఆకు మొక్కు
మహా జాతర వలె మేడారం మినీ జాతరకు ఊరటం గ్రామం నుంచి చందోల వంశీయుల ఆడబిడ్డలు, ఎంపీపీ గొంది వాణిశ్రీ, సత్యనారాయణ, మాధవరావులు చెలపెయ్య ఆవును ప్రత్యేక పూజలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఆవుకు పూజలు నిర్వహించి డోలు వాయిద్యాలతో కాలి నడకన ఊరటం కాజ్వే ద్వారా నడుచుకుంటూ వెళ్లి మేడారం సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించారు.
మినీ మేడారం జాతరకు సకల సౌకర్యాలు
గిరిజన స్త్రీ- సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
మినీ మేడారం జాతరలో సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులూ జరగకుండా సకల సౌకర్యాలు కల్పించినట్టు గిరిజన స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. మేడారంలో గిరిజనుల ఆరాధ్య దైవం సమ్మక్క- సారలమ్మ మినీ జాతర నేపథ్యంలో గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ జడ్పీ చైర్మెన్ కుసుమ జగదీష్, జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య, పీఓ అంకిత్, ఎస్పీ గౌస్ ఆలంతో కలిసి మంత్రి సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకున్నారు. మేడారం ఆలయ పూజారులు ఆదివాసీ సంప్రదాయ ప్రకారం వారికి ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి వనదేవతలకు ఇష్టమైన చీర సారే సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. మినీ జాతర జరుగుతున్న నేపథ్యంలో రూ.3 కోట్ల 10 లక్షలతో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసిందని స్పష్టం చేశారు.