Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్లకార్డులతో నిరసన, రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్
నవతెలంగాణ- శాయంపేట
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ గండ్రజ్యోతికి నిరసన తెగ తాకింది. శాయంపేటలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వెళ్లిన వారిని.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని, రోడ్డు నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు నిరసన తెలిపారు. బుధవారం గ్రామపంచాయతీ కార్యాలయానికి, పాత పోలీస్ స్టేషన్ సమీపంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే, జడ్పీ చైర్పర్సన్ శంకుస్థాపన చేశారు. తిరిగి వెళ్తున్న క్రమంలో గ్రామస్తులు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. రోడ్డు వెడల్పు నిర్మాణ కోసం స్వచ్ఛందంగా ఇండ్లను కూలగొట్టుకున్నామని, ఏడాది గడుస్తున్నా ఇప్పటివరకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు ప్రొసీడింగ్ కాపీ అందజేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే రోడ్డు వెడల్పు కోసం గ్రామపంచాయతీ నిధుల నుంచి రూ.6,41,320 నాలుగు నెలల కిందటే విద్యుత్ శాఖకు చెల్లించారని, విద్యుత్ స్తంభాల క్రమబద్ధీకరణ పూర్తికాగానే రోడ్డు పనులు పూర్తి చేస్తామని తెలిపారు. అర్హులందరికీ త్వరలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు.