Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర బడ్జెట్‌పై ఎమ్మెల్సీ అలుగుబెల్లి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర బడ్జెట్లో విద్యా, వైద్య రంగాల్లోని ప్రధాన అంశాలను వదిలేసి, కొన్ని ప్రత్యేక అంశాలకు మాత్రమే బడ్జెట్ కేటాయింపులు చేయడం సరైంది కాదని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ రెండు రంగాలను ప్రయివేటుకు వదిలేసేలా బడ్జెట్ ఉన్నదని తెలిపారు. దేశంలోని 15 లక్షల పాఠశాలలను ఎలా అభివృద్ధి చేస్తామనే ప్రస్తావన లేకుండా అందరికీ నాణ్యమైన విద్యనందించటం సాధ్యం కాదని తెలిపారు. గిరిజనుల్లో అత్యధిక మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతుం టారనీ, అలాంటి పాఠశాలలను అభివృద్ధి చేయకుండా 750 ఏకలవ్య స్కూళ్లు ప్రారంభిస్తాం, అందులో 3.50 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటారంటూ గొప్పలు చెప్పుకోవడం కేంద్ర ప్రభుత్వానికే చెల్లిందని ఎద్దేవా చేశారు.
బడ్జెట్లో ఉన్నత విద్యారంగం, ప్రభుత్వ యూనివర్సిటీల ప్రస్తావన, పతిపాదనలేవీ లేవు, పరిశోధనా రంగం గురించి కూడా ప్రస్తావించలేదు. యువతకు పని నైపుణ్యం కల్పిస్తాం, ఏ దేశమైనా పోయి బతకండి అనే విధంగా బడ్జెట్ ప్రసంగం చేశారని అలుగుబెల్లి ఈ సందర్భంగా విమర్శించారు. వైద్య రంగంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి ఎలాంటి సూచనలు లేవని తప్పుపట్టారు. వాటిని అభివృద్ధి చేయకుండా ప్రభుత్వ వైద్యరంగాన్ని బాగు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. రోడ్లు, రవాణా రంగాలను ప్రయివేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తామని చెప్పడమంటే ప్రజలపై అదనపు భారాలు మోపడమేనని అభిప్రాయపడ్డారు. ప్రయివేటు రంగంలో పని చేస్తున్న కార్మిక వర్గం సంక్షేమం గురించి పట్టించుకోని బడ్జెట్ ప్రజా బడ్జెట్ కాదని తెలిపారు. పై పై పూతలతో ప్రజలను మభ్యపెట్టి ఓట్లేయించుకోవడానికి ఎంచుకున్న మార్గంగా ఈ బడ్జెట్ కనిపిస్తున్నదని పేర్కొన్నారు.