Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రాజెక్టులకు మొండిచేయి
- నిర్మల పద్దుపై నిపుణుల పెదవి విరుపు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
అనుకున్నంతా అయింది. మరోసారి అదే జరిగింది. కావాలనే చేసింది. తెలంగాణను ఎండబెట్టేందుకు మోడీ సర్కార్ బడ్జెట్‌ను ఆయుధంగా చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఒకటి తలిస్తే, కేంద్రం మరోకటి చేసింది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులకు ఇంకోసారి మొండిచేయి చూపింది. రిక్తహస్తాలనే మిగిల్చింది. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు దాదాపు మూడేండ్లుగా సీఎం కేసీఆర్ సర్కారు అడుగుతున్న జాతీయ హోదా సంగతి పట్టించుకోలేదు. కాగా పక్కనున్న కర్నాటకలోని అప్పర్ భద్ర డ్యామకు జాతీయ హోదాను కట్టబెట్టింది. ఎన్నికలే లక్ష్యంగా ఈ పనికి పూనుకుంది. అంతేగాక వేగవంతమైన సాగునీటి ప్రయోజన పథకం(ఏఐబీపీ) నిధులకూ కోతపెట్టింది. యూపీఏ కాలం నుంచి కొనసాగుతున్న ఈ నిధులను 50 శాతం వరకు గత బడ్జెట్ నుంచే తగ్గిస్తూ వస్తున్నది. దీనిపై సర్కారుతోపాటు సాగునీటి రంగ నిపుణులు పెదవి విరుస్తున్నారు. ఏఐబీపీ ద్వారా భారీ, మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులకు నిధులు సమకూర్చే కార్యక్రమాన్ని దాదాపుగా నీరుగార్చింది. 1996-97లో యూఏపీ సర్కారు ఏఐబీపీ పథకానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణకు సంబంధించి 11 ప్రాజెక్టులకు ఏఐబీపీ నిధులు వచ్చాయి. ఇందులో నాలుగు భారీ ప్రాజెక్టులు కాగా, ఏడు చిన్న తరహావి. దాదాపు రూ. 4,516.19 కోట్లు వచ్చాయి. 2005-06లో మాత్రం రూ.11,485.46 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. ఆ తర్వాత రూ.21,683.14 కోట్లుగా సవరించింది. కాగా తాజా బడ్జెట్లో ఏఐబీపీ నిధు లను రాష్ట్రానికి తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలోని ఆయా ప్రాజెక్టులు పూర్తికావాలంటే దాదాపు రూ. 1.50 లక్షల కోట్లు కావాల్సిందే. ఈ నిధుల కోసం కేసీఆర్ ప్రభుత్వం పదే పదే విన్నవించినా, లేఖలు రాసినా అలక్ష్యం చేస్తున్నది.
భగీరథకూ గుండుసున్న
ఇదిలావుండగా దేశంలో ఆదర్శ తాగునీటి పథకంగా పదే పదే ప్రశంసి స్తున్న మిషన్ భగీరథ పథకానికీ కేంద్రం నిధులు ఇవ్వలేదు. 2018లోనే నిటి అయోగ్ చేసిన సిఫారసులనూ తాజా బడ్జెట్లోనూ నిర్లక్ష్యం చేసింది. కేంద్రం లోని బీజేపీ సర్కారు రాజకీయ ప్రయోజ నాలు చూడటం మినహా రాష్ట్రాల సంక్షే మానికి పట్టించుకోకపోవడం తెలిసిందే.
జాతీయ రహదారులనూ మరిచింది
రాష్ట్రానికి గత ఏనిమిదేండ్ల కాలంలో జాతీయ రహదారులకు కేంద్రం రూ.1.25 లక్షల కోట్లను కేటాయించింది. కానీ, ఖర్చు చేసింది మాత్రం రూ. 18 వేల కోట్లు మాత్రమే. అంటే ఇంకా రూ. లక్ష కోట్లకుపైగా నిధులు ఇవ్వాల్సి ఉంది. దీంతో పనులు ఆలస్యంగా సాగుతున్నాయి. ఈ బడ్జెట్లోనైనా నిధులు వస్తాయని భావించిన కేసీఆర్ సర్కారు ఆశలపై నీళ్లు చల్లింది.
మాటలే..చేతల్లేవ్: మంత్రి వేముల
రాష్ట్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తప్పుబట్టారు. మాటలు కోటలు దాటుతున్నాయి. చేతలు గడపదాటం లేదు. ప్రయివేటు రంగాన్ని ప్రొత్సహిస్తారా ? నిధులు కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. ఏండ్ల తరబడి వివక్ష చూపుతున్నారు.
ఎన్నికల బడ్జెట్ : చేవెళ్ల ఎంపీ రంజీత్‌రెడ్డి
సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంలో మోడీ ప్రభుత్వం వివక్ష చూపింది. ఎన్నికలు ఉన్నాయనే పేరుతో కర్నాటకలోని అప్పర్ భద్ర డ్యాంకు జాతీయ హోదా ప్రకటించింది. తెలంగాణ ప్రాజెక్టులకు ఏమాత్రం నిధులు ఇవ్వలేదు. రైతులకూ అన్యాయం చేసింది. పార్లమెంటులో పోరాడుతాం. మోడీ ప్రభుత్వ విధానాలను ఎండగడతాం.
తెలుగు రాష్ట్రాలకు అన్యాయం: సాగునీటిరంగ నిపుణులు సారంపల్లి మల్లారెడ్డి.
సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరి గింది, రాష్ట్ర ప్రభుత్వం పదే పదే అడుగుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. అలాగే ఏఐ బీపీ నిధులనూ తగ్గిస్తూ వస్తున్నది. నిర్మిలా సీతారామన్ బడ్జెట్ కార్పో రేట్లకే తప్ప, ప్రజలకు కాదన్నారు.