Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని స్వల్పంగా పెంచి మధ్యతరగతి వేతన జీవులకు భారీ ఊరట పేరుతో ప్రచారం చేసుకోవటం సమంజసం కాదని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) తెలిపింది. వేతన జీవులను కేంద్ర ప్రభుత్వం వంచించిందని విమర్శించింది. ఈ మేరకు టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పాత, కొత్త పన్ను విధానాలను కొనసాగిస్తూ క్రమంగా పాత పన్ను విధానాన్ని ఎత్తేయటానికే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు ఈ బడ్జెట్ ద్వారా స్పష్టమైందని తెలిపారు. పరోక్ష పన్నుల ద్వారా వేతనాల నుంచి ఆదాయాన్ని రాబట్టుకుంటున్న ప్రభుత్వం వాటిపై భారీగా పన్ను వేయటమే అర్థరహితమని విమర్శించారు. కార్పొరేట్లు, ధనికులకు అధిక పన్ను రాయితీ ఇచ్చిన ప్రభుత్వం చిన్న, మధ్యతరగతి ఉద్యోగులకు ఏ మాత్రం ప్రయోజనం కలిగించలేదని పేర్కొన్నారు. కొత్త పన్ను విధానంలో పన్ను రాయితీ రూ.ఐదు లక్షల నుంచి రూ.ఏడు లక్షలకు పెంచారని తెలిపారు. కానీ కొత్త విధానంలో ఎలాంటి మినహాయింపులుండబోవని పేర్కొన్నారు. అధికాదాయ వర్గాలకు మాత్రమే ఇది కొంత మేరకు ఉపయోగకరమని వివరించారు. తక్కువ వేతనాదాయ వర్గాలు వినియోగించుకుంటున్న పాత పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ.2.50 లక్షల నుంచి రూ.మూడు లక్షలకు పెంచటం నామ మాత్రమేనని తెలిపారు. పొదుపు మొత్తాలపై రాయితీని రూ.1.50 లక్షలను అలాగే కొనసాగించారని పేర్కొన్నారు. 2014కు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ డిమాండ్ చేసిన స్టాండర్డ్ డిడక్షన్ రూ.ఐదు లక్షలు గానీ, పొదుపు మొత్తాలపై రూ.మూడు లక్షలకు పెంచాలన్న డిమాండ్‌ను అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిదేండ్ల కాలంలో అమలు చేయలేదని విమర్శించారు. శ్లాబు రేట్ల సవరణ కూడా స్వల్పంగానే ఉందని తెలిపారు. ఈ బడ్జెట్ ద్వారా ధరలు ఏమాత్రం తగ్గే అవకాశం లేదని పేర్కొన్నారు. గృహ నిర్మాణానికి ప్రోత్సాహం లేదని వివరించారు. కేంద్రం ప్రతపాదించిన ఈ బడ్జెట్ సగటు వేతన జీవులకు ఏమాత్రం సంతప్తిని కలిగించలేదని విమర్శించారు.
పొదుపును దూరం చేసేలా కొత్త పన్ను శ్లాబులు : టీఆర్టీఎఫ్
ఈ బడ్జెట్లో వ్యక్తిగత పన్ను మినహాయింపు పరిమితిని రూ.ఏడు లక్షలకు పెంచడాన్ని స్వాగతిస్తున్నామని టీఆర్టీఎఫ్ అధ్యక్షులు కావలి అశోక్‌కుమార్, ప్రధాన కార్యదర్శి కటకం రమేష్ తెలిపారు. ప్రస్తుత పన్ను విధానం ఉద్యోగుల పొదుపును దూరం చేసే విధంగా ఉందని తెలిపారు.
పన్ను మినహాయింపు పరిమితి పెంపు పట్ల హర్షం : తపస్
ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) స్వాగతించింది. పన్ను మినహాయింపు పరిమితిని రూ.ఏడు లక్షలకు పెంచడం పట్ల ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు హన్మంతరావు, ప్రధాన కార్యదర్శి సురేష్ హర్షం వ్యక్తం చేశారు.
వేతన జీవిని కనికరించని మోడీ ప్రభుత్వం : టీఎస్పీటీఏ
ఈ బడ్జెట్లో వేతన జీవిని మోడీ ప్రభుత్వం కనికరించలేదని టీఎస్పీటీఏ అధ్యక్షులు సయ్యద్ షౌకత్‌అలీ విమర్శించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు కోసం విధించిన ఆదాయ పరిమితి రూ.ఎనిమిది లక్షల వరకు పెంచినా కొంత మేరకు మేలు జరిగేదని పేర్కొన్నారు. పొదుపు రిబేట్‌ను రూ.ఏడు లక్షలకు పెంచడం వల్ల ప్రయోజనం లేదని తెలిపారు.
దగా చేసిన కేంద్రం : టీఎస్టీయూ
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మరోసారి వేతన జీవులను దగా చేసిందని టీఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఎండీ అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శి చందూరి రాజిరెడ్డి విమర్శించారు. ద్రవ్యోల్బణం పెరిగి నిజ ఆదాయం తగ్గి దేశ చరిత్రలో డాలర్‌తో రూపాయి మారక విలువ పాతాళానికి తగ్గిన ఈ తరుణంలో మధ్యతరగతి ఉద్యోగ వర్గాలకు ఊరటనిచ్చేలా ఆదాయ పన్ను స్టాండర్డ్ డిడక్షన్తోపాటు పొదుపు మొత్తాలను పెంచకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందని విమర్శించారు.