Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలో తొలి అడుగు గంభీరావుపేట విద్యాసంస్థలు
- మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కె.తారకరామారావు
- రాష్ట్ర వ్యాప్తంగా 'మన ఊరు-మనబడి' ప్రారంభం
నవతెలంగాణ - విలేకరులు
దేశంలోనే ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన కేజీ టూ పీజీలాంటి విద్యా సంస్థలు లేవని, గంభీరావుపేట కేజీ టూ పీజీ విద్యాసంస్థలు తెలంగాణకు తొలి అడుగుగా ఉంటాయని విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం 'మన ఊరు- మన బడి' మొదటి దశ పాఠశాలలను మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో కేజీ టు పీజీ క్యాంపస్‌ను మంత్రులు సబిత, కేటీఆర్ ప్రారంభించారు. ఈ క్యాంపస్‌కు ఆచార్య జయశంకర్ పేరుగా నామకరణం చేయాలన్నారు. అనంతరం క్యాంపస్‌లోని కిండర్ గార్డెన్ నుంచి పీజీ కళాశాల బ్లాక్‌లు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, డిజిటల్ లైబ్రరీతోపాటు వివిధ విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత కేజీ టూ పీజీ విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. ఆయన హామీ ప్రతి రూపమే కేజీ టూ పీజీ క్యాంపస్ అన్నారు. కేజీ టు పీజీ క్యాంపస్ నిర్మాణానికి తోడ్పాటు అందించిన రహెజా, దివిస్ ల్యాబరేటరీ, గివ్ తెలంగాణ, ఎంఆర్ఎఫ్ ప్రతినిధులను సన్మానించారు. క్యాంపస్‌లో విద్యార్థులతో కలిసి మంత్రులు భోజనం చేశారు.
చింతకుంట మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేసిన పాఠశాలలను బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. విద్యకు దూరం కావద్దని సీఎం కేసీఆర్ వేల కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేశారన్నారు. జిల్లాలో మొదటి విడత మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా 230 పాఠశాలలను రూ.92 కోట్లలతో ఆధునీకరణ చేయనున్నట్టు తెలిపారు. నిర్మిల్‌లో పాఠశాలను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు.
మన బస్తీ-మన బడి కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లో పలు చోట్ల అభివృద్ధి చేసిన పాఠశాలలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. పద్మారావునగర్‌లోని మైలార్‌గూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని లక్ష్మినగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని రాజ్‌భవన్ ప్రాథమిక పాఠశాలలో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు సాయన్న, దానం నాగేందర్, హైదరాబాద్ డీఈవో ఆర్.రోహిణీతో కలిసి మంత్రి ప్రారంభించారు.
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతినగర్‌లో మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి వసతులు కల్పిస్తున్నామన్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కమలానగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు.
నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం ప్రాథమిక పాఠశాల, నార్కట్‌పల్లి ప్రాథమిక పాఠశాలను పరిషత్ చైర్మెన్ బండా నరేందర్‌రెడ్డి ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల భవనాన్ని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కలెక్టర్ హేమంత్కేశవ్పాటిల్తో కలిసి ప్రారంభించారు.
ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెం ప్రాథమిక పాఠశాలను రూ.12.49 లక్షలు, శాంతినగర్ ఉన్నత పాఠశాలను రూ.1.14 కోట్లతో మన ఊరు-మన బడి/మన బస్తీ-మన బడి కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేయగా.. మంత్రి పువ్వాడ అజరుకుమార్ ప్రారంభించారు.జనగామ జిల్లా దేవరుప్పల ప్రభుత్వ పాఠశాలను మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరారు.