Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తే బీఆర్ఎస్కు ప్రజల్లో సానుకూలత
- బీజేపీ బలపడకుండా చేయడమే వామపక్ష, లౌకికశక్తుల లక్ష్యం
- కేంద్రం సహాయ నిరాకరణ వల్లే ఉద్యోగులకు జీతాలు ఆలస్యం
- రాష్ట్రానికి జీఎస్టీ బకాయిలు, నిధులివ్వకుండా కక్షసాధింపు
- విద్యావైద్యం ప్రభుత్వరంగంలో ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు
- ప్రతిపక్షం లేకుండా చేయాలనుకోవడం అప్రజాస్వామికం
- చట్టసభల్లో ప్రజాస్వామ్యస్ఫూర్తి కనిపించడం లేదు
- బడ్జెట్లో భారీ కేటాయింపులతో మోసం
- వామపక్షాల పోరాటం వల్లే పోడు సాగుదార్లకు త్వరలో పట్టాలు
- నవతెలంగాణతో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉందనీ, ఆయా లోపాలను సరిదిద్దుకుని ముందుకుపోతేనే మనుగడ ఉంటుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేస్తేనే ప్రజల్లో సానుకూల దృక్పథం వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీని రాష్ట్రంలో బలపడకుండా చేయడమే వామపక్షాలు, లౌకికశక్తుల లక్ష్యమని స్పష్టం చేశారు. దేశంలో, రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలనుకోవడం అప్రజాస్వామికమని విమర్శించారు. చట్టసభల పనిదినాలు, ప్రజాసమస్యలపై చర్చ వంటి అంశాల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి కనిపించడం లేదని అన్నారు. శుక్రవారం నుంచి శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో నవతెలంగాణ ప్రతినిధి బొల్లె జగదీశ్వర్‌కు తమ్మినేని వీరభద్రం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు...
బడ్జెట్ సమావేశాల సందర్భంగా గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన హామీల అమలు కోసం ఇందిరాపార్క్ వద్ద ధర్నాచౌక్ దద్దరిల్లేది. ఇటీవలి కాలంలో అలాంటి పరిస్థితి లేదు కదా. ఎందుకు?
ప్రభుత్వం ప్రజాస్వామికంగా వ్యవహరించకపోవడమే దీనికి కారణం. గతంలో ప్రభుత్వాలు సమ్మెలు, నిరసనలు జరిగితే చర్చలు జరిపి పరిష్కరించే ప్రయత్నం చేసేవి. కానీ తెలంగాణ వచ్చాక ఆ పరిస్థితి లేదు. అయితే అసంతృప్తి పెరిగేకొద్దీ అణచివేత కూడా పెరుగుతున్నది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అసంతృప్తితో ఉన్న ప్రజల సమస్యలను చర్చించి పరిష్కరించడం లేదు. ఆర్టీసీ కార్మికులు, వీఆర్ఏలు, పంచాయతీ కార్మికులు సమ్మె చేశారు. వారిని పిలిచి చర్చించి ఒప్పందం కుదుర్చుకోలేదు. సమ్మె విరమించాలంటూ ప్రభుత్వం ఒత్తిడి పెంచింది. డిమాండ్ చేయడం కాకుండా అడుక్కోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇంకోవైపు ధర్నాచౌక్‌లో నిరసనలకు అను మతి ఇవ్వడం లేదు. అందుకే పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది.
ఈ వారంలో పోడు భూములకు పట్టాలిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. ఇది వామపక్షాల విజయంగా భావించవచ్చా.?
వామపక్షాల పోరాటం వల్లే రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మునుగోడు ఉప ఎన్నికలు, బీజేపీ ప్రమాదం ముంచుకొస్తున్న తరుణంలో వామపక్షాల అవసరం బీఆర్ఎస్కు పెరిగింది. ఈ నేపథ్యంలోనే పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. చట్టప్రకారం అర్హులందరికీ పట్టాలివ్వాలి. కానీ గొట్టికోయలకు పట్టాలివ్వ బోమంటూ చెప్తున్నది. ఇది సరైంది కాదు. చట్టవిరుద్ధంగా వ్యవహరించొద్దు. అర్హులందరికీ పట్టాలివ్వాలి.
డబుల్ బెడ్రూం ఇండ్లు, నిరుద్యోగ భృతి వంటి వాగ్దానాలను ప్రభుత్వం అమలు చేయడం లేదు. దీని్న ఏ విధంగా చూడొచ్చు.?
ఇచ్చిన వాగ్దానాల అమల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలున్నాయి. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం, సొంత జాగా ఉన్న ఇంటి నిర్మాణం కోసం రూ.మూడు లక్షల సహాయం, దళితులకు మూడెకరాల భూపంపిణీ, రాష్ట్రమంతా దళితబంధు అమలు వంటి హామీలను ఇచ్చింది. కానీ వాటిని సమర్థంగా అమలు చేయడంలో విఫలమవుతున్నది. ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరి ఇబ్బందికరంగా మారింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, గ్రాంట్లు, జీఎస్టీ బకాయిలు సకాలంలో విడుదల కావడం లేదు. తెలంగాణ పట్ల కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెచ్చుకోకుండా ఆంక్షలు విదిస్తున్నది. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం వాగ్దానాలను సక్రమంగా అమలు చేయలేకపోతున్నది. ప్రభుత్వంలోనూ కొన్ని బలహీనతలున్నాయి. శక్తికి మించి వాగ్దానాలు చేయడమూ ఇబ్బందిగా మారింది.
ఈ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్. ఎనిమిదేండ్ల బడ్జెట్లపై మీ అభిప్రాయమేంటీ?
ప్రభుత్వాలు ధనికవర్గాలకు అనుకూలంగా బడ్జెట్లను రూపొందిస్తాయి. అయితే రాష్ట్రంలో కొన్ని పథకాలు పేదలకు ఉపయోగపడేలా ఉన్నాయి. కళ్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు అందులో భాగమే. రైతుబంధు పేదలతోపాటు భూస్వాములకూ ఉపయోగపడుతున్నది. 50, 100 ఎకరాలున్న వారికి ఎందుకివ్వాలనే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాం.
ఇది పరిశీలనలో ఉన్నది. భవిష్యత్తులో పెద్దవారికి నిలిపివేసే అవకాశమున్నది. కొన్ని రాష్ట్రాలతో పోల్చితే మన దగ్గర సంక్షేమ పథకాలు బాగున్నాయి. అయితే ఎవరినీ కలవకపోవడం, ప్రతిపక్షాల పట్ల అసహనం ఉండడం ఇబ్బందికరంగా ఉన్నది. దీంతో మధ్యతరగతి ప్రజల్లో ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నది. ఉద్యోగాల కల్పన పూర్తిస్థాయిలో లేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఈ ప్రభుత్వంలో లోపాలున్నా భవిష్యత్తులోనూ అది కొనసాగితేనే రాష్ట్రానికి, ప్రజలకు లాభం. బీజేపీ ఎదిగితే ప్రమాదకరం.
రాజకీయంగా బీఆర్ఎస్కు కలిసొచ్చే అంశాలకే ఎక్కువ నిధులు, ప్రాధాన్యత ఇస్తున్నది. దీన్ని ఎలా చూడాలి?
ప్రభుత్వ ప్రాధాన్యతల వల్ల అసమానతలు పెరుగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నది. అది పూర్తయినా దక్షిణ తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాలకు సాగునీరందదు. దేవాదుల, సీతారామసాగర్, డిండి ఎత్తిపోతల, పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల వంటి ప్రాజెక్టులను పూర్తి చేస్తేనే ఆయా జిల్లాలకు ఉపయోగం కలుగుతుంది. భారీ ప్రాజెక్టులే కాకుండా చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిచ్చి నిధులు కేటాయించాలి. హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమలు వచ్చినా జిల్లాలకు విస్తరించలేదు. విద్యావైద్యంలో ప్రయివేటురంగ ఆధిపత్యం కొనసాగుతున్నది. ఆ రెండూ ప్రభుత్వరంగంలో ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలందుతాయి.
బడ్జెట్లో కేటాయించిన నిధులకు, ఖర్చుకు చాలా తేడా ఉంటున్నది. దీనిపై ఏమంటారు?
బడ్జెట్లో భారీగా నిధులను కేటాయించి చూపిస్తున్నారు. దాన్ని చూసి సంతోషపడుతున్నారు. కానీ శాఖల వారీగా ఖర్చును చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. భారీగా కేటాయింపులు చేసి అరకొర నిధులను ఖర్చు చేయడమంటే ప్రజలను మోసం చేయడమే.
ప్రాజెక్టులు, హైవేలు, ఫ్లైఓవర్లు, నూతన సచివాలయం నిర్మాణ పనులకు నిధులు విడుదలవుతున్నాయి. కానీ ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్‌మెంట్, రైతులకిచ్చే సబ్సిడీలు పెండింగ్‌లో ఉంటున్నాయి?
పట్టణాలు పెరుగుతున్నాయి. హైవేలు, ఫ్లైఓవర్లు అవసరమే. అయితే గ్రామీణ ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. గిరిజన, ఆదివాసీ ప్రాంతాల్లో విషజ్వరాలతో చనిపోయే పరిస్థితి ఇప్పటికీ ఉన్నది. కానీ హైదరాబాద్‌లో సూపర్ స్పెషాలిటీ సేవలు, గుండె మార్పిడి చికిత్స అందుతున్నది. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. కేరళలో మండల కేంద్రంలోనూ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులున్నాయి. విద్యావైద్యరంగాల్లో దేశానికే ఆ రాష్ట్రం ఆదర్శం.
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఒకటో తేదీన జీతాలు రాని పరిస్థితి ఉన్నది. దీనిపై ఏమంటారు?
తెలంగాణ ధనికరాష్ట్రం. కానీ ప్రజలు ధనికులు కాదు. హైదరాబాద్ ఉండడం వల్ల ఆదాయం వస్తున్నది. అయినా ఉద్యోగులకు జీతాలు, కాంట్రాక్టర్లకు నిధులివ్వలేని పరిస్థితి ఇప్పుడు వచ్చింది. కేంద్రం సహాయ నిరాకరణ చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నది. కోవిడ్ వచ్చినపుడు కేంద్రం సహాయం చేయలేదు. అన్ని రంగాలు కుదేలయ్యాయి. జీఎస్టీ బకాయిలు, గ్రాంట్లు, నిధులు విడుదల చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నది. ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం తలకు మించిన వాగ్దానాలను చేయడంతో ఉద్యోగులకు జీతాలు, డీఏలు చెల్లించలేని పరిస్థితి ఇచ్చింది.
మాజీ ఎంపీ, ఎమ్మెల్యేగా ప్రస్తుత చట్టసభల పనితీరు, పనిదినాలపై మీ స్పందన?
గతంలో బాగుందని కాదు. ఇప్పటి కంటే మెరుగ్గా ఉండేది. సభ్యులు లేవనెత్తిన అంశాలను మంత్రులు రాసుకుని సమాధానం ఇచ్చేవారు. బడ్జెట్లో సవరణలు కూడా జరిగేవి. ఇప్పుడు చట్టసభల్లో ప్రజాస్వామ్య వాతావరణం కనిపించడం లేదు. ప్రభుత్వం, ప్రతిపక్షం అంటే అర్థాన్నే మార్చారు. ప్రతిపక్షం చేసే విమర్శలను ప్రభుత్వం వినాలి. ఒక సెక్షన్ ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను ప్రతిపక్షం ప్రభుత్వం దృష్టికి తెస్తుంది. పైకి విమర్శించినా ప్రభుత్వానికి ప్రతిపక్షం సాధనంగా ఉపయోగపడుతుంది.
వాస్తవాలను గ్రహించి ప్రజల్లో ఉన్న అసంతృప్తిని పోగొట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. కానీ ప్రతిపక్షాలను అణచివేయడానికి, వాటిని లేకుండా చేసేందుకు అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అప్రజాస్వామికంగా వ్యవహరించడం సరైంది కాదు. నయా ఉదారవాద విధానాలు అమల్లోకి వచ్చాక నియంతృత్వం పెరిగింది.
కేంద్ర ప్రభుత్వ విధానాలనే విమర్శిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ లోపాలను ప్రశ్నించడం లేదన్న అభిప్రాయం వినిపిస్తున్నది. ఏమంటారు?
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మతోన్మాదంతోపాటు కార్పొరేటీకరణ, ప్రయివేటీకరణ విధానాలను అవలంభిస్తున్నది. ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నది. అందుకే వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న లోపాలను సీఎం దృష్టికి తీసుకెళ్తున్నాం. బహిరంగంగా ప్రకటించడం లేదు. బీజేపీకి అవకాశమిచ్చే ఏ పనిచేయడం లేదు. రాజకీయంగా ఈ ప్రభుత్వం బలహీనపడొద్దన్నదే మా అభిప్రాయం. బీజేపీ బలపడితే ప్రమాదకర పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ఇది రాష్ట్రానికి, ప్రజలకు నష్టం కలిగిస్తుంది.