Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలి :
- తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని
- కొత్తగూడెం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ- కొత్తగూడెం
పేదలు గుడిసెలు వేసుకున్న ప్రభుత్వ భూమిలో ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు మంజూరు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని వెంకటేశ్వర కాలనీ పంచాయతీ పరిధిలోని 137/1 ప్రభుత్వ భూమిలో ఇండ్ల స్థలాల కోసం పేదలు గుడిసెలు వేశారు. గుడిసెలు వేసుకున్న స్థలం వెంకటేశ్వర కాలనీ నుంచి చుంచుపల్లి తహసీల్దార్ కార్యాలయం వరకు బుధవారం వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రేపాకుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో పోతినేని మాట్లాడారు. ఇంటి స్థలం, ఇండ్లు లేక పేదలు ఇబ్బందులు పడుతున్నారని.. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలందరికీ వెంటనే ఇండ్ల స్థలాలు, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పే అభివృద్ధి కాగితాల్లో మాత్రమే ఉందని విమర్శించారు. ప్రజలకు ఇండ్లు, విద్య, భూమి, వైద్యం అందినప్పుడే నిజమైన అభివృద్ధి అన్నారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరరపు కనకయ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించి పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గుడిసెల ప్రాంతంలో మంచినీరు, విద్యుత్ ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు లిక్కి బాలరాజు, సీఐటీయూ జిల్లా నాయకులు భూక్య రమేష్, వీరన్న, ఐద్వా నాయకులు సందకూరి లక్ష్మి, ఈసం రాంబాబు, బాల కృష్ణ, ప్రేమ్ కుమార్, జబ్బ సంధ్యారాణి, రాము, సిద్దెల రాములు, పూజారి నాగమణి, వీరమ్మ, రామకోటమ్మ, శివ, రాజు తదితరులు పాల్గొన్నారు.