Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిబ్రవరి 15న చలో హైదరాబాద్ విజయవంతం చేయాలి : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
- రాష్ట్ర పశుమిత్రుల వర్కర్స్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక
నవతెలంగాణ-ముషీరాబాద్
పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న పశుమిత్రులను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం రాష్ట్ర పశుమిత్రుల వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో ఎడ్ల రమేష్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ.. పశుసంవర్ధక శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2500 మంది పశుమిత్రులు ఎనిమిదేండ్లుగా సేవలందిస్తున్నారని తెలిపారు. వీరిలో ఎక్కువగా మహిళలే ఉన్నారని చెప్పారు. వీరికి ఐకేపీ ద్వారా ప్రభుత్వం శిక్షణ ఇచ్చి ఎలాంటి పారితోషికమూ నిర్ణయించకుండా పశువైద్య శాఖలో పశుమిత్రులుగా నియమించిందన్నారు. వారు గ్రామీణ ప్రాంతాల్లో పశువులు, గోర్లు, మేకలకు కృత్రిమ గర్భధారణతోపాటు వ్యాక్సినేషన్, నట్టల మందు వేయడం, వ్యాధుల నివారణకు సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో పశు మిత్రులకు ఫిక్స్డ్ వేతనం, యూనిఫామ్, గుర్తింపు కార్డు, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోకపోతే ఫిబ్రవరి 15న చలో ప్రగతి భవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జె.వెంకటేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ శాఖల్లో జీవో నెంబర్ 60 ప్రకారం వేతన సౌకర్యాలు కల్పించాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం, ఆశా కార్యకర్తల మాదిరిగా పశుమిత్రులకు పారితోషికం నిర్ణయం తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో పశుమిత్రులంతా బీఆర్ఎస్ నాయకులను నిలదీయడానికి సిద్ధం కావాలన్నారు. అనంతరం రాష్ట్ర నూతన కమిటీని ప్రకటించారు.
రాష్ట్ర కమిటీ..
రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా జె.వెంకటేష్, అధ్యక్షులుగా కె.శారద, ప్రధాన కార్యదర్శిగా కాసు మాధవి, కోశాధికారిగా శ్రీరామ్ పద్మ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా కవిత, మనిషా, శ్రీలత, త్రివేణి, ప్రియాంక, సహాయ కార్యదర్శిగా ఎడ్ల రమేష్, లక్ష్మీనరసింహ, కమిటీ సభ్యులుగా లలితా, ప్రభా, మౌనిక తదితరులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు లక్ష్మీనారాయణ, చంద్రశేఖర్, రంజిత్ కుమార్, కవిత, కడారి నరసింహ, భాగ్య తదితరులు పాల్గొన్నారు.