Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేకపోతే ఉద్యమం తీవ్రతరం
- వీఆర్ఏల మౌనదీక్షలో జేఏసీ నాయకులు
- సీఐటీయూ,కేవీపీఎస్, చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ మద్ధతు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వీఆర్ఏలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలనీ, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వీఆర్ఏల జేఏసీ నాయకులు హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద 'స్టేట్ వీఆర్ఏ జేఏసీ' ఆధ్వర్యంలో మౌనదీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విధంగా వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలనీ, 55 ఏండ్లు పైబడిన వారి వారసులకు ఉద్యోగాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అర్హత కలిగిన వీఆర్ఏలకు పదోన్నతులివ్వాలనీ, 80 రోజుల సమ్మె కాలానికి వేతనాన్ని, ఆ సమయంలో మరణించిన వారి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలనే డిమాండ్లతో బ్యానర్‌ను, ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి తరలొచ్చిన వీఆర్ఏలతో ధర్నాచౌక్ దద్దరిల్లింది. 80 రోజుల పాటు సమ్మె చేస్తే మునుగోడు ఎన్నికలకు ముందు ప్రభుత్వం దిగొచ్చి డిమాండ్లను నెరవేరుస్తామమంటూ హామీ ఇచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ హామీ ఇచ్చి 100 రోజులు గడుస్తున్నా... అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై సీఎం కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు, మంత్రులకు, ప్రజా ప్రతినిధులకు, ఉన్నతాధికారులకు పలుమార్లు వినతిపత్రాలిచ్చినప్పటికీ ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపుల్లో వీఆర్ఏల డిమాండ్లను తీర్చేందుకు అనుగుణంగా కేటాయింపులు చేయకపోతే గుణపాఠం తప్పదని హెచ్చరించారు. మంత్రి కేటీఆర్ నాలుగు సార్లు, సీఎస్ రెండు సార్లు చర్చించారనీ, సీఎం అసెంబ్లీలో ప్రకటించినా ఆ మేరకు జీవోలు ఇవ్వకపోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. మౌనదీక్షలో జేఏసీ చైర్మెన్ గడ్డం రాజయ్య, కో చైర్మెన్ రమేష్ బహదూర్, సెక్రెటరీ జనరల్ షేక్ దాదేమియా, కో కన్వీనర్లు వంగూరు రాములు, షేక్ రఫీ, మాదవ నాయుడు, వెంకటేష్ యాదవ్ తదితరులు మాట్లాడారు.
మతోన్మాదులకు అవకాశమివ్వొద్దు
డిమాండ్ల సాధన కోసం వీఆర్ఏలు చేస్తున్న పోరాటానికి కేవీపీఎస్ మద్ధతు ప్రకటించింది. ఈ మేరకు మౌనదీక్షనుద్దేశించి ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏ చిన్న అసంతృప్తి ఉన్నా..దాన్ని ఉపయోగించుకునేందుకు మతోన్మాదులు కాచుకూర్చుంటున్నారని తెలిపారు. అలాంటి అవకాశాన్నివారికి ఇవ్వొద్దని సీఎం కేసీఆర్‌కు సూచించారు. ప్రభుత్వ మాటను గౌరవించి వీఆర్ఏలు సమ్మె విరమించారనీ, అదే రీతిలో వారికి సర్కారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు. వీఆర్ఏల పోరాటానికి చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ సంపూర్ణ మద్ధతు ప్రకటించింది. సమన్వయ కమిటీ తరపున మౌనదీక్షనుద్దేశించి రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పైళ్ల ఆశయ్య మాట్లాడుతూ వీఆర్ఏల సమస్యల పరిష్కరించకుండా కాలయాపన చేయడం తగదని హితవు పలికారు. వారిని విస్మరిస్తే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ తదితరులు మౌనదీక్షలో పాల్గొని, వీఆర్ఏల పోరాటానికి మద్దతు తెలిపారు.