Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ప్రతిపాదించిన బడ్జెట్.. రాష్ట్రాలను నిరుత్సాహ పరిచేదిగా ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. అది రైతులు, పేదలకు వ్యతిరేకంగా ఉందని పేర్కొన్నారు. బడ్జెట్లో అందమైన మాటలు తప్ప.. నిధుల కేటాయింపులో డొల్లతనమే కనబడుతున్నదని విమర్శించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఏడు ప్రాధాన్యతారంగాలకు పెద్ద పీట వేశామని చెబుతూనే అసలు రంగాలను గాలికొదిలేశారని తెలిపారు. ప్రస్తుత బడ్జెట్ ద్వారా తెలంగాణకు మరోసారి తీవ్ర అన్యాయం చేశారని వాపోయారు. పారిశ్రామిక వాడలకు సంబంధించి తెలంగాణకు ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్తగా ఇస్తామంటూ చెప్పలేదని తెలిపారు. రైతులకు సంబంధించిన నిధుల్లో భారీగా కోతలు విధించారు.. ఎరువుల సబ్సిడీలు తగ్గించారని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ఉపాధి హామీ నిధుల్లో కోత పెట్టారు, ఆహార సబ్సిడీలు తగ్గించారని పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సులను అమలు చేస్తామంటూ బడ్జెట్లలో ఎక్కడా చెప్పలేదనీ, ఉద్యోగులకు, సింగరేణి కార్మికులకు ఇచ్చిన పన్ను మినహాయింపులు కూడా ఏ మాత్రం ఆశాజనకంగా లేవని తెలిపారు. ఉద్యోగులను సైతం భ్రమల్లో ముంచారని విమర్శించారు. సెస్సుల భారం తగ్గించలేదు.. పన్నుల భారం నుంచి ఉపశమనం లేదని ఆయన పేర్కొన్నారు. అందువల్ల నిర్మలా సీతారామన్ ప్రతిపాదించిన పద్దును ఆయన భ్రమల బడ్జెట్‌గా అభివర్ణించారు.
కేంద్ర బడ్జెట్‌పై హరీశ్‌రావుతోపాటు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కూడా స్పందించారు. ఈ పద్దు రైతులకు వ్యతిరేకంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఎరువుల సబ్సిడీకి కేంద్రం మెల్లగా మంగళం పాడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎరువులు, క్రిమి సంహారక మందులు, పెట్రోల్, డీజిల్ ధరలతో రైతులు సతమతమవుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎరువులపై సబ్సిడీలను ఎత్తేస్తే వారిపై మరింత భారాలు పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగానికి గతేడాది కన్నా ఈసారి 22 శాతం తక్కువగా కేటాయింపులు చేయటం దారుణమని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్... రాష్ట్ర ప్రభుత్వాలను నిర్వీర్యం చేసేదిగా ఉందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో పద్దును నింపేశారని తెలిపారు. జనరల్ బడ్జెట్లో రైల్వే బడ్జెట్‌ను కలపటంతో తీవ్ర గందరగోళం నెలకొంటోందని పేర్కొన్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తదితరులు కూడా కేంద్ర బడ్జెట్‌పై స్పందించారు. అది దేశంలోని పేదలు, బడుగు, బలహీనవర్గాలకు వ్యతిరేకంగా ఉందని వారు విమర్శించారు.