Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలను తిప్పి కొట్టాలి
- పట్టాలు అందే వరకు పోరాటం ఆగదు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ.అబ్బాస్
నవతెలంగాణ-భూపాలపల్లి
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాలు నియంత పాలన కొనసాగిస్తున్నాయని బడా నేతలకు అప్పనంగా ఎకరాల కొద్దీ భూములు కట్టబెడుతూ.. పేదలకు మాత్రం గుంట భూమి ఇవ్వడం లేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ.అబ్బాస్ అన్నారు. ఇండ్ల స్థలాల పట్టాలు అందే వరకు పోరాటం ఆగదని, పేద ప్రజలకు ఎర్రజెండా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పాత ఎర్ర చెరువు సర్వే నంబర్ 280, 283, 284, 285లోని సుమారు 24 ఎకరాల శిఖం భూమిలో ఆరు రోజుల కిందట సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గుడిసెలు వేశారు. సుమారు 1500 గుడిసెలు వేశారు. బుధవారం అబ్బాస్ గుడిసెవాసులను కలిసి మద్దతు తెలిపారు. అనంతరం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి అని.. దానిపై పూర్తి హక్కు పేదలకే ఉంటుందన్నారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 32వేల ఎకరాల్లో ఎర్రజెండాలు రెపరెపలాడుతున్నాయని వివరించారు. ఆయా ప్రాంతాల్లో ఇండ్ల స్థలాల కోసం మూడున్నర లక్షల మంది నిరుపేదలు గుడిసెలు వేసుకున్నట్టు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తానన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పటికీ ఇవ్వకపోవడంతో పేదలు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుంటున్నారన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తుంటే గుడ్లప్పగించి చూస్తున్న ప్రభుత్వం.. పేదలపై కేసులు పెట్టడం సరైన పద్ధతి కాదన్నారు. భూపోరాటంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం కండ్లు తెరిచి శిఖం భూములను పేదలకు పంచి పట్టాలు ఇవ్వడంతోపాటు ఇండ్లు కట్టించాలని డిమాండ్ చేశారు. భూమిని వదిలేది లేదని కరెంటు నీరు, రావాల్సిందేనని స్పష్టం చేశారు. ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం ఫిబ్రవరి 9న హైదరాబాదులో జరిగే మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో 45 కోట్ల మంది దగ్గర ఉన్న సొత్తు ఎంతో.. కేవలం ఒక అదాని దగ్గర అంత ఉందని చెప్పారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో 15 ఎకరాల్లో ఓ ధనవంతుడు ఇల్లు నిర్మించుకుంటే తప్పులేదు కానీ.. పేదలు గుడిసెలు వేసుకుంటే దౌర్జన్యం ఎందుకని ప్రశ్నించారు. పేదలకు ఉపయోగపడే నిత్యావసర సరుకులు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉజ్వల భారత్ పేరుతో పేదలు గ్యాస్ పంపిణీ చేసినా.. ధర పెరగడం వల్ల మళ్లీ కట్టెల పొయ్యే దిక్కు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కాంపెటి రాజన్న, చెన్నూరి రమేష్, పొలం రాజేందర్, దమేర కిరణ్, నాయకులు డబ్బా రాజన్న, అతుకురి శ్రీకాంత్, పొలం చిన్న రాజేందర్, సకినాల మల్లయ్య, గుర్రం దేవందర్, బొడ్డు కిషోర్, బొడ్డు స్మరన్, రిత్విక్, విజరు, మహేందర్, సంపత్, రాజు పాల్గొన్నారు.