Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉభయసభలనుద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్
- ప్రోగ్రెస్ రిపోర్టు చెప్పేందుకు బీఆర్ఎస్ వ్యూహం
- వైఫల్యాలను ఎండగట్టేందుకు కాంగ్రెస్ సన్నాహాలు
- రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై బీజేపీ ఫోకస్
- పాత బస్తీ సమస్యలపై ఎంఐఎం కుస్తీ
- వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న పార్టీలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రానున్నది ఎన్నికల సీజన్. శుక్రవారం ఉదయం 12.30 గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పార్టీలు సాధారణ ఎన్నికలకు అనుగుణంగా వ్యవహరించనున్నాయి. అసెంబ్లీ వేదికగా వాటి ఆలోచన విధానాన్ని చెప్పేందుకు సిద్ధమవుతున్నాయి. బీఆర్ఎస్ ఐదేండ్లపాలనకు ఈ బడ్జెట్ సమావేశాలు చివరివి కానున్నాయి. అందుకే బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీ పార్టీలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. అధికార బీఆర్ఎస్ ఐదేండ్లకాలంలో చేసిన ప్రోగ్రెస్ రిపోర్టును ప్రజల ముందుంచేందుకు ఎత్తులు వేస్తున్నది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిన క్రమంలో దేశ ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు కీలకమైన పథకాలను ఏకరువు పెట్టాలని భావిస్తున్నది. అందుకు అసెంబ్లీ వేదికను ఉపయోగించుకునేందుకు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు శ్రమించాల్సి ఉందంటూ సంకేతాలిచ్చినట్టు తెలిసింది. రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టు నిర్మాణం ద్వారా పంటల ఉత్పత్తి పెరగడం, వృద్ధాప్య, వితంతువు పెన్షన్లు, మన ఊరు, మన బడి, పల్లె, పట్టణ ప్రగతి, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాల నిర్మాణం, నూతన సచివాలయ నిర్మాణం, యాదాద్రి అభివృద్ధి వంటి విషయాలను అసెంబ్లీ వేదికగా చెప్పేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ప్రవేశ పెడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం.... అదే క్రమంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టేందుకు పావులు కదుపుతున్నది. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై అసెంబ్లీ బయట తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్న బీఆర్ఎస్ నేతలు... శాసనసభ, మండలి సమావేశాల్లోనూ ఫోకస్ చేయాలని భావిస్తున్నది. ప్రతిపక్ష పార్టీల వ్యూహాన్ని చిత్తు చేసేందుకు బీఆర్ఎస్ పక్కా ప్రణాళికలు తయారుచేసినట్టు తెలిసింది. మరోవైపు ప్రతిపక్ష ఎంఐఎం మాత్రం బీఆర్ఎస్ ఏం చెప్పినా తలూపేందుకు సిద్ధంగా ఉన్నది. పాతబస్తీ సమస్యలను ప్రస్తావిస్తూ... ఇతర సమస్యల విషయంలో కర్ర విరగదు... పాము చావదు' అన్నట్టు వ్యవహరించాలని నిర్ణయించినట్టు తెలిసింది. సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్, ఎంఐఎం ఒప్పందంతో ముందుకు పోనున్నాయి. శత్రువు భేదం కాకుండా మిత్ర భేదంతోనే ఉండేందుకు ఆ పార్టీ ఇష్టపడుతున్నది. ఆ రకంగా అసెంబ్లీ వేదికగా పాత బస్తీకి కొన్ని ప్రత్యేక నిధులు రాబట్టాలని చూస్తున్నది. సభలో ప్రతిపక్ష ఎంఐఎం పార్టీకి భిన్నంగా కాంగ్రెస్ వ్యవహరించాలని భావిస్తున్నది. ఇప్పటికే బీఆర్ఎస్ వైఫల్యాలపై చార్జిషీట్లు విడుదల చేస్తున్న కాంగ్రెస్... అసెంబ్లీలోనూ అదే దూకుడు ప్రదర్శించాలని నిర్ణయించింది. ధరణి వెబ్ పోర్టల్ తెచ్చిన చిక్కులు రైతుల మెడకు ఊరితాళ్లుగా మారుతున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. ధరణిలో రైతుల దరఖాస్తులు అప్డేట్ కాకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే అంశాన్ని సర్కారు దృష్టికి తీసుకెళ్లనున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకుల్లో రైతుల అప్పులు పెరిగిపోతున్నాయనే విషయాన్ని ప్రస్తావించనుంది. నిరుద్యోగ భృతి, పంటనష్టం, వైపరీత్యాలు, డబుల్ బెడ్ రూమ్, పోడుభూములు తదితర సమస్యలను ప్రస్తావించాలని నిర్ణయించింది. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, పెండింగ్ ప్రాజెక్టులపై సర్కారు నిర్లక్ష్యాన్ని ఎండగడుతూనే... ప్రభుత్వ డొల్లతనాన్ని ఎండగట్టేందుకు ఎత్తులు వేస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ కేటాయింపులు, ఖర్చులను లెక్కలతో సహా చెప్పి ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపేందుకు అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలని భావిస్తున్నది. అయితే బీజేపీ మాత్రం ప్రభుత్వ వైఫల్యాల కంటే, రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధుల ప్రస్తావన చేయడం ద్వారా ప్రజల్లోకి బీజేపీ విధానాలను తీసుకెళ్లేందుకు ప్లాన్ చేసింది. రాష్ట్రానికి కేంద్రం మొండి చేయి చూపిస్తున్న బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టేందుకు బీజేపీ సిద్ధమవుతున్నది. మొత్తంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆయా పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ...ఎన్నికల సభగా మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
5న మంత్రివర్గ సమావేశం
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ నెల 5న సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్ర బడ్జెట్‌పై క్యాబినెట్లో చర్చించి ఆమోదం తెలపనుంది.